Pushpa 2 : పుష్ప 2 చుద్దామంటే బాయ్‌ఫ్రెండ్ ఒప్పుకోలేదని యువతి సూసైడ్ అటెంప్ట్!
పుష్ప 2 సినిమాకి వెళదాం అంటే బాయ్‌ఫ్రెండ్ ఒప్పుకోలేదన్న కారణంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది! యూపీలో జరిగిన ఈ ఘటనలో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది! పుష్ప 2 సినిమా చూద్దామంటే బాయ్‌ఫ్రెండ్ ఒప్పుకోలేదన్న కారణంతో ఓ యువతి సూసైడ్ అటెంప్ట్ చేసింది.
ఇదీ జరిగింది..
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలో బుధవారం జరిగింది ఈ ఘటన. ఝార్ఖండ్ ధనబాద్కి చెందిన ఆ ఇద్దరు ట్రిప్ కోసం వారణాసి వెళ్లారు. ఆ 22ఏళ్ల యువతి బీహెచ్‌యూకు అనుసంధానమైన కాలేజ్‌లో చదువుకుంది. కాగా.. కాన్వొకేషన్లో పాల్గొనేందుకు తన బాయ్‌ఫ్రెండ్ కలిసి నగరానికి వెళ్లింది. 23ఏళ్ల ఫుర్ఖన్తో కలిసి ఒక హోటల్లో ఆమె ఉంది. పుష్ప 2 సినిమాకి వెళదామని ఆమె, తన బాయ్‌ఫ్రెండ్‌ని అడిగింది. అందుకు అతను ఒప్పుకోలేదు. ఆమెకు కోపం వచ్చింది. ఇద్దరి మధ్య కొంతసేపు గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది.
తాను నివాసముంటున్న హోటల్లోని మూడో అంతస్తుకు వెళ్లిన యువతి అక్కడి నుంచి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసింది. స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎమర్జెన్సీ చికిత్స అందించారు. కాగా ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ వ్యవహారం పోలీసులకు తెలిసింది. సదరు బాయ్‌ఫ్రెండ్‌ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
"చెట్గంజ్లోని రామ్కటోరా ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది. యువతి- యువకుడు ఓ హోటల్లో రూమ్ తీసుకున్నారు. అయితే, హఠాత్తుగా ఆమె 3వ అంతస్తులో నుంచి దూకేసింది. ఘటనపై దర్యాప్తు చేపట్టాము," అని పోలీసులు వెల్లడించారు.
దంపతుల ఆత్మహత్య..
ఘజియాబాద్ షాలిమార్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలోని ఓ ఇంట్లో 51 ఏళ్ల వ్యక్తి, అతని భార్య (48) మంగళవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దంపతులకు 12 ఏళ్ల కుమారుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
దంపతులు పనిమీద బయటకు వెళ్లే ముందు తమ బిడ్డను పక్కనే ఉంటున్న వ్యక్తి తల్లిదండ్రుల వద్ద వదిలేశారని సీనియర్ అధికారులు తెలిపారు. ఇది వారి దినచర్య, కానీ మంగళవారం సాయంత్రం తమ బిడ్డను తీసుకెళ్లడానికి దంపతులు రాలేదు!
దీంతో ఆ వ్యక్తి తల్లిదండ్రులు మరో కుమారుడికి ఫోన్ చేసి దంపతుల ఇంటికి వెళ్లి ఆరా తీశారు. అతని సోదరుడు వారి ఇంటికి వచ్చి చూసేసరికి ఇద్దరూ రెండు వేర్వేరు గదుల్లో సీలింగ్ ఫ్యాన్లకు వేలాడుతూ కనిపించారు. ఇంటి తలుపు లోపలి నుంచి తాళం వేయలేదు. పోలీసులకు సమాచారం అందించామని, ఒక బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించిందని షాలిమార్ గార్డెన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సలోని అగర్వాల్ తెలిపారు.
కుటుంబ సభ్యుల ప్రాథమిక విచారణలో దంపతులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు.
సంబంధిత కథనం