మంచు ఫ్యామిలీలో వివాదం ముదురుతోంది. గత రెండు రోజులుగా మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య వార్ నడుస్తుండగా.. దుబాయ్ నుంచి మంచు విష్ణు రాకతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు చేసిన మంచు మనోజ్.. తాజాగా తెలంగాణ ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిశారు. పహాడిషరీఫ్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఈరోజు మంచు మనోజ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
మంచు ఫ్యామిలీలో శనివారం గొడవ జరగగా.. ఆదివారం విషయం బయటికి వచ్చింది. తొలుత గొడవ ఏమీ లేదని.. తప్పుడు ప్రచారం చేయొద్దంటూ మంచు ఫ్యామిలీ ఒక ప్రకటనని విడుదల చేసింది. కానీ.. ఆదివారం రాత్రి గాయాలతో ఆసుపత్రిలో చేరిన మంచు మనోజ్.. సోమవారం పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మంచు మోహన్ బాబు కూడా రాచకొండ సీపీకి లేఖ ద్వారా మంచు మనోజ్ దంపతులపై ఫిర్యాదు చేశారు.
మంగళవారానికి మంచు మోహన్ బాబు కాస్త వెనక్కి తగ్గారు. ఈరోజు వ్యక్తిగతంగా వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేస్తానన్న మోహన్ బాబు.. ‘‘ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది.. దీన్ని మేమే పరిష్కరించుకుంటాం’’ అని తేల్చిచెప్పేశారు. అయితే.. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య మాత్రం వార్ ఇంకా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది.
మంచు మనోజ్ తన రక్షణ కోసం తెచ్చుకున్న దాదాపు 30 మంది బౌన్సర్లని మంచు విష్ణు బౌన్సర్లు బలవంతంగా బయటికి పంపించారు. ఈ క్రమంలో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించినట్లు మంచు మనోజ్ ఆరోపించారు. తనపై 10 మంది వ్యక్తులు దాడి చేసి.. ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా తీసుకెళ్లారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కోరుతూ పోలీసుల్ని ఆశ్రయించిన మంచు మనోజ్.. ఈరోజు భార్య మౌనికతో కలిసి తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.