Jadeja on Ashwin Retirement: రోజంతా కలిసే ఉన్నా హింట్ ఇవ్వలేదు.. అప్పుడే తెలిసింది: అశ్విన్ రిటైర్మెంట్‍పై జడేజా
Ravindra Jadeja on Ashwin Retirement: రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‍పై రవీంద్ర జడేజా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. తాము రోజంతా కలిసే ఉన్నా కనీసం హింట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. చివరి నిమిషాల్లో తెలిసిందని అన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‍కు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‍కు గురి చేశాడు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ జరుగుతున్న మధ్యలోనే వీడ్కోలు చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఆసీస్‍తో గబ్బాలో జరిగిన మూడో టెస్టులో అశ్విన్‍కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ సిరీస్‍లో ఇంకా రెండు టెస్టులు ఉండగానే భారత జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించాడు అశ్విన్. అయితే, అశ్విన్ నిర్ణయం భారత స్పిన్నర్ రవీంద్ర జడేజాకు కూడా కొన్ని నిమిషాల ముందే తెలిసిందట. ఆ విషయాన్ని అతడు తాజాగా వెల్లడించాడు.
రోజంతా కలిసే ఉన్నా..
రోజంతా కలిసే ఉన్నా రిటైర్మెంట్ గురించి అశ్విన్ తనకు హింట్ కూడా ఇవ్వలేదని రవీంద్ర జడేజా అన్నాడు. “చివరి నిమిషాల్లో రిటైర్మెంట్ గురించి నాకు తెలిసింది. మీడియా సమావేశానికి ఐదు నిమిషాల ముందే తెలిసింది. నాకు ఇది షాకింగ్‍గా అనిపించింది. ఇద్దరం రోజంతా కలిసి సమయం గడిపాం. కానీ అతడు నాకు హింట్ కూడా ఇవ్వలేదు. చివర్లో తెలిసింది. అశ్విన్ ఎలా ఆలోచిస్తాడో మనందరికి తెలుసు కదా” అని మెల్‍బోర్న్ క్రికెట్ గ్రౌండ్‍లో మీడియాతో జడేజా చెప్పాడు.
106 టెస్టు మ్యాచ్‍లో ఆడిన అశ్విన్ 537 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్, జడేజా స్పిన్ జోడీ చాలా మ్యాచ్‍ల్లో ఇండియాను గెలిపించింది. ఇద్దరూ కలిసి 58 టెస్టులు అడగా.. 587 వికెట్లను జంటగా తీసుకున్నారు. అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ (501 వికెట్లు) దాటేసి.. సక్సెస్ ఫుల్ భారత స్పిన్ ద్వయంగా నిలిచారు.
ఆన్‍ఫీల్డ్ మెంటార్‌లా..
అశ్విన్ తనకు ఆన్‍ఫీల్డ్ మెంటార్‌లా అని రవీంద్ర జడేజా చెప్పాడు. “నాకు అతడు ఆన్‍ఫీల్డ్ మెంటార్ లాంటి వ్యక్తి. మ్యాచ్ పరిస్థితి ఎలా ఉంది, బ్యాటర్లు ఏం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు లాంటి అంశాలను మేం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాం. నేను అతడిని చాలా మిస్ అవుతా” అని జడేజా చెప్పాడు.
అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదనేలా జడేజా మాట్లాడాడు. అయితే, అంత కంటే బెటర్ ఆల్‍రౌండర్, బౌలర్ వస్తారని తాము ఆశిస్తున్నామని జడేజా చెప్పాడు. యువకులకు ఇదో మంచి అవకాశం అని అన్నాడు.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్రస్తుతం భారత్, ఆసీస్ 1-1తో ఉన్నాయి. ఐదు టెస్టుల సిరీస్‍లో టీమిండియా తొలి మ్యాచ్ గెలువగా.. రెండో పోరులో ఆసీస్ విజయం సాధించింది. గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టు డ్రా అయింది. ఇరు జట్లు మధ్య నాలుగో టెస్టు మెల్‍బోర్న్ వేదికగా డిసెంబర్ 26వ తేదీన మొదలుకానుంది. ఈ టెస్టులో గెలిచి సిరీస్‍లో ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరు జట్లు కసిగా ఉన్నాయి. ఇప్పటికే మెల్‍బోర్న్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ ఆశలు నిలువాలంటే భారత్‍కు ఈ మ్యాచ్‍లో గెలవడం చాలా ముఖ్యం. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ సిరీస్‍లో ఇప్పటివరకు విఫలమయ్యాడు. మిగిలిన రెండు టెస్టుల్లో అయినా సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు.
సంబంధిత కథనం