Ashwin Stats: అంకెల్లో అశ్విన్.. తిరుగులేని స్పిన్నర్.. లోయర్ ఆర్డర్ ఆపద్బాంధవుడు.. 14 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైల్‌స్టోన్స్
Ashwin Stats: రవిచంద్రన్ అశ్విన్ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే మేటి స్పిన్నర్ గా తన కెరీర్ గా ముగింపు పలికాడు. అతని 14 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన వెంటనే అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటన చేయడం షాక్ కు గురి చేసింది.
Ashwin Stats: రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు బుధవారం (డిసెంబర్ 18) రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లో మూడో టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత మీడియా సమావేశానికి రోహిత్ తో కలిసి వచ్చిన అతడు.. అంతర్జాతీయ క్రికెటర్ గా తనకు ఇదే చివరి రోజని అన్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ప్లేయర్స్ లో ఒకడైన అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ గణాంకాలు ఒకసారి చూద్దాం.
అంకెల్లో అశ్విన్
- సెప్టెంబర్ 17, 1986లో జన్మించిన అశ్విన్.. జూన్ 5, 2010లో ఇండియా తరఫున తొలి వన్డే ఆడాడు. ఆ తర్వాత ఏడాదికి అంటే నవంబర్ 6, 2011లో వెస్టిండీస్ పై టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు.
- 38 ఏళ్ల అశ్విన్ టెస్టుల్లో 537 వికెట్లతో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానంలో ఉన్నాడు. అనిల్ కుంబ్లే 619 వికెట్లతో టాప్ లో ఉన్నాడు.
- ఇక టెస్టుల్లో 37సార్లు ఒక ఇన్నింగ్స్ లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. ఈ విషయంలో లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ ను సమం చేశాడు. ముత్తయ్య మురళీధరన్ 67సార్లు ఈ ఘనత సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
- టెస్టుల్లో అత్యధికంగా 268సార్లు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను ఔట్ చేసి వాళ్లపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు.
- మొత్తంగా 287 అంతర్జాతీయ మ్యాచ్ లలో అతడు 775 వికెట్లు తీసుకున్నాడు. అందులో 537 టెస్టు వికెట్లు, 156 వన్డే వికెట్లు, 72 టీ20 వికెట్లు ఉన్నాయి. అనిల్ కుంబ్లే 956 వికెట్లతో టాప్ లో ఉండగా.. అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా ప్రపంచ క్రికెట్ లో అతని స్థానం 11.
- టెస్టుల్లో ఆరు సెంచరీలు కూడా చేశాడు. మొత్తంగా 3503 టెస్టు రన్స్ ఉన్నాయి. టెస్టుల్లో 3 వేల రన్స్, 300కుపైగా వికెట్లు తీసుకున్న 11 మంది ఆల్ రౌండర్లలో అతనూ ఒకడు. 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఏషియా కప్ గెలిచిన జట్లలోనూ ఉన్న అశ్విన్.. టెస్టు క్రికెట్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు సొంతం చేసుకున్న క్రికెటర్.
డబ్ల్యూటీసీలో ఛాంపియన్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో అశ్విన్ ఆధిపత్యం మామూలుగా లేదు. ఇప్పటి వరకూ ఇందులో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా రిటైరయ్యాడు.100 వికెట్ల మార్క్ అందుకున్న తొలి బౌలర్ అతడే. డబ్ల్యూటీసీలో 41 మ్యాచ్ లు ఆడిన అశ్విన్ 195 వికెట్లు తీసుకున్నాడు. అతని తర్వాత ఆస్ట్రేలియా స్పిన్నర్ నేథన్ లయన్ 190 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్లోనూ కింగే
అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టడానికి అతని ఐపీఎల్ ప్రదర్శనే కారణం. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ కెప్టెన్సీలో అతడు ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఆ టీమ్ ఛాంపియన్ గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా ఐపీఎల్ తోపాటు క్లబ్ క్రికెట్ లో అశ్విన్ కొనసాగనున్నాడు. వచ్చే సీజన్ కోసం అతడు మరోసారి సీఎస్కే తరఫునే ఆడనున్నాడు. ఈ మధ్యే వేలంలో తిరిగి అతన్ని దక్కించుకుంది.
స్వదేశంలో తిరుగులేని అశ్విన్
అశ్విన్ స్వదేశంలో తిరుగులేని స్పిన్నర్. స్పిన్ కు అనుకూలించే ఇండియన్ పిచ్ లపై అశ్విన్ ను ఎదుర్కోవడం ఏ ప్రపంచస్థాయి బ్యాటర్ కైనా సవాలే. అతడు ఇండియాలో 383 టెస్టు వికెట్లు తీసుకోవడం విశేషం. అయితే విదేశాల్లో మాత్రం అంతగా రాణించలేదు.
ముఖ్యంగా సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 26 టెస్టులు ఆడిన అశ్విన్.. పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ మధ్యే అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడగా.. అందులో కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు.