Team India Target: గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా సాహసం.. 89 పరుగులకే డిక్లేర్.. టీమిండియా టార్గెట్ 275
Team India Target: గబ్బా టెస్టులో టీమిండియా గెలవాలంటే 275 రన్స్ చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్ ను ఆస్ట్రేలియా 7 వికెట్లకు 89 పరుగుల దగ్గరే డిక్లేర్ చేసి ఇండియన్ టీమ్ కు సవాలు విసిరింది. చివరి రోజు మరో 54 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
Team India Target: ఆస్ట్రేలియా సవాలు విసిరింది. బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టులో ఫలితం కోసమే చూస్తున్న కంగారూలు.. టీమిండియా ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. తమ రెండో ఇన్నింగ్స్ ను వాళ్లు కేవలం 89 పరుగుల దగ్గరే డిక్లేర్ చేయడం విశేషం. అప్పటికే వాళ్లు 7 వికెట్లు కోల్పోయారు. అయితే చివరి రోజు ఈ టార్గెట్ చేజ్ చేయడం టీమిండియాకు అంత సులువు కాదు.
ఆస్ట్రేలియా 89/7 డిక్లేర్
బ్రిస్బేన్ టెస్టు చాలా వరకు వర్షం వల్ల సరిగా జరగలేదు. నాలుగున్నర రోజులు కలిపి సుమారు 210 ఓవర్ల వరకు మాత్రమే ఆట సాధ్యమైంది. ఈ నేపథ్యంలో ఇలాంటి మ్యాచ్ లోనూ ఫలితం రాబట్టడానికి ఆస్ట్రేలియా ప్రయత్నిస్తోంది. టీమిండియాను తొలి ఇన్నింగ్స్ లో 260 పరుగులకు కట్టడి చేసి 185 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఆ టీమ్.. రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 89 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. మొత్తంగా 274 పరుగుల ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్ లో వేగంగా పరుగులు చేసే క్రమంలో ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది. మొదటి నుంచీ ఆ టీమ్ బ్యాటర్లు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించారు. దీంతో వికెట్లు పడుతూనే వెళ్లాయి. బుమ్రాు 3, సిరాజ్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్ కమిన్స్ 22 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
టీమిండియాకు సాధ్యమేనా?
టీమిండియాకు ఆస్ట్రేలియా విసిరిన సవాలు అంత సులువుగా కనిపించడం లేదు. తొలి ఇన్నింగ్స్ లోనే ఆస్ట్రేలియా పేసర్లను సమర్థంగా ఎదుర్కోలేక కిందామీదా పడిన మన బ్యాటర్లు చివరి రోజు 275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తారా లేదా అన్నది చూడాలి. మొదట్లోనే వికెట్లు పడితే మాత్రం డ్రా కోసం ఆడే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ గెలిచేందుకు ప్రయత్నిస్తారా లేదా? టీమ్ వ్యూహం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
అంతకుముందు చివరి రోజు ఉదయం టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 260 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్ దీప్ 31 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. బుమ్రా 10 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ఈ ఇద్దరూ కలిసి చివరి వికెట్ కు 47 పరుగులు జోడించి టీమిండియాను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించిన విషయం తెలిసిందే.