Ind vs Aus 3rd Test Day 5: గబ్బా స్టేడియం దగ్గర మెరుపులు, పిడుగుపాటు.. ఆట ఆపేసిన అంపైర్లు.. టీమిండియా ఆలౌట్-ind vs aus 3rd test day 5 lightning at gabba stadium umpires stopped play team india all out for 260 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus 3rd Test Day 5: గబ్బా స్టేడియం దగ్గర మెరుపులు, పిడుగుపాటు.. ఆట ఆపేసిన అంపైర్లు.. టీమిండియా ఆలౌట్

Ind vs Aus 3rd Test Day 5: గబ్బా స్టేడియం దగ్గర మెరుపులు, పిడుగుపాటు.. ఆట ఆపేసిన అంపైర్లు.. టీమిండియా ఆలౌట్

Hari Prasad S HT Telugu
Dec 18, 2024 08:09 AM IST

Ind vs Aus 3rd Test Day 5: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఐదో రోజు ఆటలో అంపైర్లు ఉరుములు, మెరుపులు, పిడుగుపాటుతో మ్యాచ్ ను ఆపేయడం గమనార్హం. అప్పటికే ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 260 పరుగులకు ఆలౌటైంది.

గబ్బా స్టేడియం దగ్గర మెరుపులు, పిడుగుపాటు.. ఆట ఆపేసిన అంపైర్లు.. టీమిండియా ఆలౌట్
గబ్బా స్టేడియం దగ్గర మెరుపులు, పిడుగుపాటు.. ఆట ఆపేసిన అంపైర్లు.. టీమిండియా ఆలౌట్ (AFP)

Ind vs Aus 3rd Test Day 5: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 260 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాకు 185 రన్స్ ఆధిక్యం లభించింది. అయితే నాలుగు రోజులుగా మ్యాచ్ కు వర్షం అడ్డు పడుతుండగా.. ఐదో రోజు మాత్రం స్టేడియం దగ్గర ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు వల్ల అంపైర్లు ఆటను నిలిపేశారు. తర్వాత కాసేపటికే జోరుగా వర్షం కురిసింది.

ఉరుములు, మెరుపులు.. ఆట నిలిపివేత

గబ్బా స్టేడియంలో వరుణుడు మ్యాచ్ ను వదలడం లేదు. చివరి రోజు కూడా ఉదయం 4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టీమిండియా తన చివరి వికెట్ కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరుకు మరో 8 పరుగులు జోడించి 260 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్ దీప్ (31)ను ట్రావిస్ హెడ్ ఔట్ చేశాడు. బుమ్రాతో కలిసి ఇండియాను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించిన ఆకాశ్ దీప్.. చివరి వికెట్ గా వెనుదిరిగాడు. బుమ్రా 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియాకు 185 పరుగుల ఆధిక్యం లభించింది.

ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత ఆట ప్రారంభం కావాల్సి ఉన్నా.. గబ్బా స్టేడియం దగ్గర ఉరుములు, మెరుపులు కనిపించడంతో వర్షం లేకపోయినా అంపైర్లు ఆటను నిలిపేశారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్లేయర్స్ భద్రత దృష్ట్యా అంపైర్లు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత కొన్నేళ్లుగా ఐసీసీ ఈ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది.

ఐసీసీ రూల్‌పై టౌఫెల్ ఏమన్నాడంటే?

ఐసీసీ నిబంధన గురించి మాజీ అంపైర్ సైమన్ టౌఫెల్ వివరించాడు. ఐసీసీ 30-30 మెరుపుల నిబంధన గురించి అతడు వెల్లడించాడు. ఇది గత ఐదారేళ్లుగా అమలు చేస్తున్నట్లు తెలిపాడు. దీని ప్రకారం ఓ మెరుపు కనిపించి 30 సెకన్లలోపు పిడుగుపాటు శబ్దం వినిపిస్తే వెంటనే ఆట ఆపేయాలి. అంపైర్లు గబ్బా స్టేడియంలో అదే చేశారు.

ఒకవేళ తుఫాను దూరంగా వెళ్లిపోతూ, 30 సెకన్లకు కాస్త అటూఇటూగా ఈ పిడుగుపాటు జరిగితే అంపైర్లు తమ విచక్షణ మేరకు ఆటను కొనసాగించే నిర్ణయం తీసుకోవచ్చని కూడా ఈ నిబంధన చెబుతోందని టౌఫెల్ వివరించాడు. గబ్బా స్టేడియంలోనూ అదే జరిగిందని, మెరుపు చాలా దగ్గరగా కనిపించిందని, 30 సెకన్లలోపే పిడుగు పడిన శబ్దం రావడంతో ఆటను అంపైర్లు నిలిపేసినట్లు చెప్పాడు. ఇది ప్లేయర్స్, అఫీషియల్స్, గ్రౌండ్ స్టాఫ్, ప్రేక్షకుల భద్రత కోసం తీసుకొచ్చిన నిబంధన అని తెలిపాడు.

ఇదే తొలిసారి కాదు

నిజానికి ఇలా మెరుపులు, ఉరుములు, పిడుగుపాటు వల్ల ఆట నిలిపేయడం ఇదే తొలిసారి కాదు. ఈ మధ్యే ఆస్ట్రేలియాలోనే మరో ఘటన కూడా జరిగింది. నవంబర్ లో పాకిస్థాన్ టీమ్ ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు తొలి టీ20 మ్యాచ్ ఈ పిడుగుపాటు వల్ల ఆలస్యమైంది. ఆ మ్యాచ్ కూడా గబ్బా స్టేడియంలోనే జరగడం గమనార్హం. ఈ మ్యాచ్ ను చివరికి 7 ఓవర్లకు కుదించగా.. ఆస్ట్రేలియా విజయం సాధించింది.

Whats_app_banner