Ind vs Aus 3rd test Day 4: ఫాలో ఆన్ ఉచ్చులో టీమిండియా.. రాహుల్ సెంచరీ మిస్.. ఇక ఆ ఇద్దరిపైనే ఆశ
Ind vs Aus 3rd test Day 4: టీమిండియా ఫాలో ఆన్ ప్రమాదంలో పడిపోయింది. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లో జరుగుతున్న మూడో టెస్టు నాలుగో రోజు కేఎల్ రాహుల్ సెంచరీ మిస్ కాగా.. జడేజా, నితీష్ కుమార్ రెడ్డిపైనే టీమ్ ఆశలు పెట్టుకుంది.
Ind vs Aus 3rd test Day 4: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఫాలో ఆన్ ఆడే ప్రమాదలో పడింది. నాలుగో రోజు లంచ్ సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 167 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా కంటే ఇంకా 278 పరుగులు వెనుకబడి ఉంది. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే కనీసం 79 పరుగులు చేయాలి. ఈ నేపథ్యంలో జడేజా (41 నాటౌట్), నితీస్ కుమార్ రెడ్డి (7 నాటౌట్)పైనే టీమ్ ఆశలు పెట్టుకుంది.
ఫాలో ఆన్ గండం గట్టెక్కేనా?
తరచూ వర్షం అడ్డు తగులుతున్న బ్రిస్బేన్ టెస్టు నాలుగు రోజు ఆట తొలి సెషన్ కు కూడా వరుణుడు ఆటంకం కలిగిస్తూనే ఉన్నాడు. మూడో రోజే తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాకు నాలుగో రోజు తొలి సెషన్ లో మరో రెండు వికెట్లు కోల్పోయింది.
కెప్టెన్ రోహిత్ శర్మ (10) మరోసారి తీవ్రంగా నిరాశ పరిచాడు. అటు టాపార్డర్ లో రాణించిన ఏకైక బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. రాహుల్ 84 పరుగులు చేసి లయన్ బౌలింగ్ లో స్లిప్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓవైపు బ్యాటర్లంతా చేతులెత్తేస్తూ వరుసగా పెవిలియన్ కు క్యూ కడుతున్న వేళ.. 139 బంతుల పాటు ఎంతో ఓపిగ్గా క్రీజులో ఉన్న రాహుల్ సెంచరీ చేస్తాడనుకున్నా.. 84 పరుగుల దగ్గరే ఆగిపోయాడు.
అయితే అతడు ఆరో వికెట్ కు జడేజాతో కలిసి 67 పరుగులు జోడించడంతో టీమ్ ఈ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. చివరికి స్మిత్ కళ్లు చెదిరే క్యాచ్ తో రాహుల్ నిరాశగా వెనుదిరిగాడు. లంచ్ సమయానికి జడేజా 41, నితీష్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటికీ ఫాలో ఆన్ గండం పొంచి ఉంది. మరో 79 పరుగులు చేస్తేనే ఈ గండం నుంచి టీమ్ గట్టెక్కుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిపైనే టీమ్ ఆశలు పెట్టుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమిన్స్ చెరో రెండు వికెట్లు తీయగా.. హేజిల్‌వుడ్, లయన్ చెరొక వికెట్ తీసుకున్నారు.
44 పరుగులకే 4, 74 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా.. రాహుల్, జడేజా పోరాటంతో టీమ్ కాస్త కోలుకుంది. నాలుగో రోజు మరో రెండు సెషన్లు, ఐదో రోజు ఉండటంతో ఈ మ్యాచ్ లో ఓటమి నుంచి గట్టెక్కాలంటే టీమిండియా పోరాటంతోపాటు వరుణుడి సాయం కూడా అవసరమయ్యేలా ఉంది. ఫాలో ఆన్ తప్పించుకోగలిగితే.. మ్యాచ్ ను డ్రాగా ముగించే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రెండో సెషన్ కీలకంగా మారనుంది.