TG Liquor Revenue: మద్యం అమ్మకాలతో తెలంగాణలో రూ.20వేల కోట్ల ఆదాయం, ఎనిమిది నెలల్లో రికార్డు స్థాయి ఆదాయం
TG Liquor Revenue: తెలంగాణలో మద్యం విక్రయాల ద్వారా ఎనిమిది నెలల్లో రూ.20వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో మద్యం విక్రయాల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్టు తెలంగాణ అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
TG Liquor Revenue: తెలంగాణలో మద్యం విక్రయాలతో ప్రభుత్వ ఖజానాకు 8 నెలల్లో రూ.20,903.13 కోట్ల ఆదాయం సమకూరినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు వరకు ఎక్సైజ్ శాఖకు మద్యం అమ్మకాలపై రెవెన్యూ రూపేణా రూ.10,285.58 కోట్లు విలువ ఆధారిత పన్ను రూపంలో రూ.10,607.55 కోట్లు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అసెంబ్లీలో ప్రకటించింది.
తెలంగాణ శాసనసభలో బీఆర్‌ఎస్ సభ్యులు కేపీ వివేకానంద, హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్‌లు అడిగిన ప్రశ్నలకు అబ్కారీ శాఖ సమాధానం ఇచ్చింది. బెల్టు షాపులు ఎన్ని ఉన్నాయని సభ్యులు అడిగిన ప్రశ్నకు.. రాష్ట్రంలో బెల్ష్ షాపులకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
అక్రమ మద్యం విక్రయాలను కట్టడి చేస్తున్నామని, ఎక్సైజ్ చట్టాల ప్రకారం ఎప్పటికప్పుడు అనధికారిక మద్యం విక్రయా లపై కేసులు నమోదు చేస్తున్నామని సభలో ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు నాటికి అనధికారిక విక్రయాలపై 6,915 కేసులు నమోదు చేశామని వివరించారు. ఈ కేసుల్లో 6,728 మందిని అరెస్టు చేయడంతో పాటు 74,425 లీటర్ల మద్యం 353 వాహనాలను జప్తు చేసినట్లు వెల్లడించారు. మద్యపాన దుష్ప్రభావాలు, మత్తు పదార్థాల దుర్వినియోగంపై తెలంగాణలో 735 అవగాహన సదస్సులు నిర్వహించారు.
ఏపీలో కళ్లు చెదిరే ఆదాయం..
2023-24 ఆర్ధిక సంవత్సరంలో మద్యం విక్రయాలతో ఏపీలో ఎక్సైజ్ శాఖకు దాదాపు 36వేల కోట్ల రుపాయల ఆదాయం సమకూరింది. అన్ని రకాల ఖర్చులు మినహాయించగా దాదాపు రూ.30వేల కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి లభించింది. 2019-24 మధ్య ఏపీలో మద్యం ధరల్ని గణనీయంగా పెంచడంతో పాటు ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నిర్వహించడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించింది.
అక్టోబర్ నుంచి ప్రైవేట్ విక్రయాలు…
అక్టోబర్ 16 నుంచి ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9 వరకు రూ.4,677 కోట్ల వ్యాపారం జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. 55 రోజుల వ్యవధిలో 61.63 లక్షల కేసుల లిక్కర్, 19.33 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. వైసీపీ హయాంలో ప్రభుత్వమే స్వయంగా మద్యం షాపులు నిర్వహించింది. అయితే కూటమి సర్కార్ ఆ విధానానికి స్వస్తి పలికింది. రెండేళ్ల పాటు అమల్లో ఉండే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం...ప్రైవేట్ లిక్కర్ షాపులకు టెండర్లు పిలిచి 3,300 లిక్కర్ షాపులు ఏర్పాటు చేసింది.
రూ.4677 కోట్ల ఆదాయం
రాష్ట్ర వ్యాప్తంగా 3,300 లిక్కర్ దుకాణాల టెండర్ల రూపంలో ప్రభుత్వానికి దాదాపు రూ.2,000 కోట్ల ఆదాయం సమకూరింది. అక్టోబర్ 16వ తేదీ నుంచి నూతన మద్యం షాపులు ప్రారంభం అయ్యాయి. అయితే నిబంధనల ప్రకారం షాపులు పాడుకున్న యజమానులకు 20 శాతం కమిషన్ ఇవ్వాలి. అయితే ఇంకా పాత మద్యమే విక్రయిస్తున్నట్లు చెబుతున్న ఎక్సైజ్ శాఖ...కమిషన్ తక్కువగా ఇస్తుంది. ఇప్పటికైనా 20 శాతం కమిషన్ ఇవ్వాలని మద్యం షాపుల యజమానుల నుంచి ఒత్తిడి వస్తుంది.
20 శాతం కమిషన్ ఇవ్వకుంటే నష్టాలు వస్తాయని మద్యం దుకాణాలు యజమానులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లలో కలిపి అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు రూ.4,677 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. రానున్న రోజుల్లో లిక్కర్ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. క్రిస్టమస్, సంక్రాంతి సీజన్ కావడంచో లిక్కర్ సేల్స్ మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.