Jagtial Cheating : జగిత్యాల జిల్లాలో ఘరానా మోసం, ప్రతి నెలా రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ డబ్బులు కాజేసిన యువకుడు-jagtial youth cheated retd employees linked phone pe number bank account ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial Cheating : జగిత్యాల జిల్లాలో ఘరానా మోసం, ప్రతి నెలా రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ డబ్బులు కాజేసిన యువకుడు

Jagtial Cheating : జగిత్యాల జిల్లాలో ఘరానా మోసం, ప్రతి నెలా రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ డబ్బులు కాజేసిన యువకుడు

HT Telugu Desk HT Telugu
Dec 16, 2024 10:30 PM IST

Jagtial Cheating : జగిత్యాలలో ఓ యువకుడు రిటైర్డ్ ఉద్యోగిని బురిడీ కొట్టించి ఏడేళ్లుగా నెలకు రూ.20 వేలు చొప్పున రూ.17 లక్షలు కాజేశాడు. రిటైర్డ్ ఉద్యోగి బ్యాంకు ఖాతాకు తన ఫోన్ పే నెంబర్ యాడ్ చేసి నెల నెలా రూ.20 వేలు కాజేస్తున్నాడు.

జగిత్యాల జిల్లాలో ఘరానా మోసం, ప్రతి నెలా రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ డబ్బులు కాజేసిన యువకుడు
జగిత్యాల జిల్లాలో ఘరానా మోసం, ప్రతి నెలా రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ డబ్బులు కాజేసిన యువకుడు

Jagtial Cheating : జగిత్యాల జిల్లాలో ఓ యువకుడు చేతివాటం ప్రదర్శించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏడేళ్లుగా నెలకు 20 వేల రూపాయల చొప్పున 17 లక్షల రూపాయలను కాజేశాడు. మోసపోయిన రిటైర్డ్ ఉద్యోగి కుటుంబం ప్రజావాణిలో కలెక్టర్ ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకున్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కు చెందిన నక్క లక్ష్మణ్ SRSP లో పనిచేసి 2011 లో రిటైర్డ్ అయ్యాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెన్షన్ పెరిగింది. నెలకు 44 వేల రూపాయల పెన్షన్ వస్తుండగా లక్ష్మణ్ కేవలం 24 వేల రూపాయలు మాత్రమే పొందుతున్నాడు. మరో 20 వేల రూపాయలను అదే ప్రాంతానికి చెందిన యువకుడు దీకొండ తిరుపతి కాజేస్తున్నాడు. ఇలా ఏడేళ్లుగా ఈ మోసం జరుగుతుంది. మోసాన్ని గమనించని వృద్ధ దంపతులు పెన్షన్ 24 వేల రూపాయలు మాత్రమే వస్తుందని భావించారు. ఇటీవల లక్ష్మణ్ తొంటికి గాయమై నడవలేని స్థితిలో మంచానికే పరిమితం కావడంతో ఆయన భార్య పెన్షన్ డబ్బుల కోసం బ్యాంక్ కు వెళ్లింది.

బ్యాంక్ అధికారులు లక్ష్మణ్ వస్తేనే డబ్బులు ఇస్తామని చెప్పడంతో బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పాలని కోరింది. ప్రస్తుతం బ్యాంకులో 25 వేల రూపాయలు ఉన్నాయని తెలిపారు బ్యాంకు సిబ్బంది. మరుసటి రోజు లక్ష్మణ్ తీసుకొని బ్యాంకుకు వెళ్ళగా బ్యాంకులో బ్యాలెన్స్ 20 వేలు మాత్రమే ఉంది. నిన్న 25,000 ఉన్న బ్యాలెన్స్ ఈరోజు 20 వేలకు ఎలా తగ్గిందని బ్యాంక్ అధికారులను వృద్ధ దంపతులు నిలదీశారు. దీంతో బ్యాంక్ అధికారులు లక్ష్మణ్ అకౌంట్ డీటెయిల్స్ తీయగా ఫోన్ పే ద్వారా ఐదు వేలు డ్రా అయినట్లు తెలిపారు. ఎవడు డ్రా చేశారని నిలదీస్తే ప్రతి నెల 20 వేల రూపాయలు తిరుపతి అనే వ్యక్తి ఫోన్ నెంబర్ ద్వారా డ్రా అవుతున్నట్లు స్పష్టం చేశారు.

ఫోన్ పే తో యువకుడు మోసం

లక్ష్మణ్ నివాసం ఉండే ప్రాంతంలోనే నివసించే యువకుడు దీకొండ తిరుపతి లక్ష్మణ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ కు తన ఫోన్ నెంబర్ ను అటాచ్ చేశారు. లక్ష్మణ్ కు ప్రతినెల 44 వేల రూపాయల పెన్షన్ ఖాతాలో పడగానే తిరుపతి 20వేల రూపాయలు ఫోన్ పే ద్వారా డ్రా చేయడం మొదలు పెట్టాడు. అలా గత ఏడేళ్లుగా ప్రతినెల 20 వేల చొప్పున దాదాపు 17 లక్షల రూపాయలను కాజేశాడు. వృద్ద దంపతులు బ్యాంకుకు వెళ్లితే వెలుగులోకి వచ్చిన మోసాన్ని చూసి లబోదిబోమంటూ న్యాయం చేయాలని కలెక్టర్ ఆశ్రయించారు. కాలు ప్యాక్షర్ అయి కదలలేని స్థితిలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మణ్ భార్య కూతురుతో కలిసి కలెక్టరేట్ కు చేరుకుని ప్రజావాణిలో కలెక్టర్ కు పిర్యాదు చేశాడు. కలెక్టర్ సత్యప్రసాద్ ను కలిసి తమకు జరిగిన మోసాన్ని వివరించి న్యాయం చేయాలని వేడుకున్నారు.

విచారణకు ఆదేశించిన కలెక్టర్

పెన్షన్ డబ్బులను కాజేసిన వైనంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ పోలీసులను ఆదేశించారు. ప్రస్తుతం ఆ యువకుడు పరారీలో ఉండగా పోలీసులు కలెక్టర్ ఆదేశంతో విచారణ జరిపి వృద్ధదంపతులకు న్యాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు. వృద్ధ దంపతులను నమ్మించి వారి అకౌంట్ కు తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ పే తో పెన్షన్ డబ్బులు కాజేసిన యువకుడు తీరుపై స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. మోసం చేసిన యువకుడి నుంచి డబ్బులు రికవరీ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం