TG Group 2 Exam : పురిటి నొప్పులు భరిస్తూ గ్రూప్-2 పరీక్ష రాసిన మహిళా అభ్యర్థి
TG Group 2 Exam : తెలంగాణలో ఆసక్తికర ఘటన జరిగింది. పురిటి నొప్పులను భరిస్తూ ఓ అభ్యర్థి గ్రూప్ 2 పరీక్ష రాశారు. పరీక్ష రాస్తున్న సమయంలో నొప్పులు రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అయితే ఆమె ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరించారు.
TG Group 2 Exam : తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు ముగిశాయి. అయితే సోమవారం గ్రూప్-2 పరీక్షలకు ఓ మహిళ పురిటి నొప్పులతో హాజరయ్యారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి అనే నిండు గర్భిణీ నాగర్ కర్నూల్ లోని జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాస్తున్న సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు...మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అందుకు ఆమె అంగీకరించలేదు. పరీక్ష పూర్తైన తర్వాతే ఆసుపత్రికి వెళ్తానని పట్టుబట్టారు. ఆమె డెలివరీ డేట్ కూడా ఇవాళే కావడంతో పరీక్ష నిర్వహణ సిబ్బంది ఆందోళన చెందారు.
పురిటి నొప్పులు వస్తున్నా..ఆ నొప్పులను భరిస్తూ పరీక్ష రాసేందుకే ఆ మహిళ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో పరీక్షా కేంద్రం వద్ద 108 అంబులెన్స్‌ను రెడీ పెట్టారు. ఆ గర్భిణీ కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. నొప్పులు ఏ క్షణంలో ఎక్కువైనా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రం వద్ద రేవతి భర్త, తల్లిని అందుబాటులో ఉంచారు. పురిటి నొప్పులతోనే అభ్యర్థి పరీక్ష పూర్తి చేశారు.
తొలి రోజు హాజరు
గ్రూప్-2 పరీక్షలకు మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేసుకోగా...74.96% మంది హాల్ టికెట్లు డౌన్ చేసుకున్నారు. వీరిలో తొలి రోజు పేపర్-1 పరీక్షకు 2,57,981 అంటే 46.75%, పేపర్-2కు 2,55,490 మంది అంటే 46.30% హాజరయ్యారు. నాలుగు పేపర్లకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. మొత్తం 783 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
సెల్ ఫోన్ తో పట్టుబడ్డ అభ్యర్థి
గ్రూప్-2 పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థి సెల్ ఫోన్‌తో పట్టుబడ్డడం కలకలం రేపుతోంది. ఈ ఘటన వికారాబాద్‌లోని శ్రీ సాయి డెంటల్ కాలేజీ పరీక్షా కేంద్రంలో ఆదివారం జరిగింది. పరీక్ష ప్రారంభానికి ముందే అభ్యర్థి సెల్ ఫోన్ ను దుస్తుల్లో పెట్టుకుని ఎగ్జామ్ సెంటర్ లోపలికి వచ్చాడు. అనుమానంతో ఎగ్జామ్ చీఫ్ సూపరిండెంట్ అతడిని చెక్ చేశారు. దీంతో ఆ అభ్యర్థి వద్ద ఫోన్ దొరికింది. అభ్యర్థిని పరీక్ష రాయనివ్వకుండా పోలీసులకు అప్పగించారు. మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద అతనిపై చర్యలు తీసుకుంటామని టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం