Telangana Assembly : ఉద్యోగాల భర్తీపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌కు స్ట్రాంగ్ కౌంటర్!-bhatti vikramarka key comments in telangana assembly on job recruitment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Assembly : ఉద్యోగాల భర్తీపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌కు స్ట్రాంగ్ కౌంటర్!

Telangana Assembly : ఉద్యోగాల భర్తీపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌కు స్ట్రాంగ్ కౌంటర్!

Basani Shiva Kumar HT Telugu
Dec 16, 2024 05:43 PM IST

Telangana Assembly : నోటిఫికేషన్లు విడుదల చేయడం అంటే ఉద్యోగాలు ఇవ్వడం కాదని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అది గత పాలకుల విధానమని సెటైర్లు వేశారు. ఉద్యోగాల భర్తీపై కౌన్సిల్‌లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు భట్టి సమాధానమిచ్చారు. ఉద్యోగాల భర్తీ లెక్కలు చెప్పారు.

ఉద్యోగాల భర్తీపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
ఉద్యోగాల భర్తీపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. 55 వేల 172 ఉద్యోగాలు భర్తీ చేశామని.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. అందులో 54 వేల 573 మందికి నియామక పత్రాలు కూడా ఇచ్చినట్టు వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేశామని వ్యాఖ్యానించారు.

గత పదేళ్లుగా యువత ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో అసంతృప్తితో ఉన్నారని భట్టి విమర్శించారు. ఉద్యోగాల కోసం యువత ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని.. నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడేలా చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే 55 నుంచి 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు.

గ్రూప్-I నిర్వహించారా..

గత పాలకులు గత పదేళ్లలో ఒక్క గ్రూప్-I పరీక్ష కూడా నిర్వహించలేకపోయారని విక్రమార్క విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పాత, కొత్త ఖాళీలను కలిపి గ్రూప్-I నోటిఫికేషన్ విడుదల చేశామని వివరించారు. ఈ పరీక్షలను ఆపాలని కొంతమంది కోర్టుకు వెళ్లారని.. హామీ ఇచ్చినట్లుగానే 563 పోస్టులకు పరీక్ష నిర్వహించామని స్పష్టం చేశారు.

మెగా డీఎస్సీ..

11 వేల 62 ఖాళీలతో డీఎస్సీ నిర్వహించామని, 10 వేల 600 మందికి నియామక పత్రాలు ఇచ్చామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఉద్యోగ నియామక పరీక్షలన్నీ పారదర్శకంగా జరిగాయని, ప్రశ్నాపత్రం లీక్ కాలేదని, ఖాళీలను భర్తీ చేస్తున్నామని వివరించారు. ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ఖాళీ పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తామని చెప్పారు. ఉర్దూ మాధ్యమంలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి డీ-రిజర్వేషన్ విధానాన్ని పరిశీలించాలని కొంతమంది సభ్యులు తనను కోరారని.. కానీ అది సాధ్యం కాలేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

బీఏసీ సమావేశం..

'అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఏసీలో స్పష్టత లేదు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. 27 అంశాలపై చర్చ జరగాలని స్పీకర్‌కు అందించాం. రైతు సమస్యలపై సభలో పూర్తిస్థాయి చర్చ జరగాలి. చర్చ జరిగేవరకు వదిలిపెట్టేది లేదు' అని పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ నిబంధనల మేరకే బీఏసీ జరిగింది.. ఎన్ని రోజులు సభ జరపాలన్నది స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ నిరసనలు..

రేపు (మంగళవారం) తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. లగచర్ల రైతులపై కేసులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని నాయకులకు స్పష్టం చేసింది. ఉదయం 11 గంటలకు అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించింది. రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.

Whats_app_banner