TG Ration Cards : కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు.. 31 లక్షల మందికి ప్రయోజనం.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం-government makes key announcement in telangana legislative council regarding new ration cards ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Ration Cards : కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు.. 31 లక్షల మందికి ప్రయోజనం.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

TG Ration Cards : కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు.. 31 లక్షల మందికి ప్రయోజనం.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

Basani Shiva Kumar HT Telugu
Dec 16, 2024 02:45 PM IST

TG Ration Cards : సంక్రాంతి తరువాత కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీ ప్రక్రియను మొదలు పెట్టబోతునట్లు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం శాసన మండలిలో ఈ మేరకు ప్రకటన చేశారు. దాదాపు 10 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేయబోతున్నట్టు వెల్లడించారు.

కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు
కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు

ప్రభుత్వ అంచనా ప్రకారం.. కొత్తగా పది లక్షల కొత్త రేషన్ కార్డుల మంజూరు ఉండవచ్చని.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తద్వారా 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల మంజూరికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేను కుడా ఆధారం చేసుకుంటామన్నారు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీతో.. ప్రభుత్వంపై అదనంగా రూ.956 కోట్ల భారం పడుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను జారీ చెయ్యబోతున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు

ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులలో అదనపు పేర్ల నమోదుకు.. మీ సేవ కేంద్రం ద్వారా గడిచిన పదేళ్లుగా వచ్చిన 18 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం నియమించారని చెప్పారు. తనను ఛైర్మన్‌గా, సహచర మంత్రులు దామోదరం రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు. ఈ ఉప సంఘం పలుమార్లు సమావేశమై.. సిఫారసులను కేబినెట్ ఆమోదం కోసం పంపించినట్లు తెలిపారు

తెల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియలో సుప్రీంకోర్టుకు సక్సేనా కమిటీ సమర్పించిన సిఫారసులను పరిగణనలోకి తీసుకున్నట్లు ఉత్తమ్ చెప్పారు. అంతే గాకుండా రాష్ట్రంలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల నుండి సేకరించిన సూచనలను కుడా మంత్రివర్గ ఉప సంఘం పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. వీటన్నింటినీ అధ్యయనం చేసిన ఉపసంఘం.. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరికి అర్హతా ప్రమాణాలు నిర్ణయిస్తూ చేసిన సిఫారసులు.. కేబినెట్ ముందుంచినట్లు ఆయన వివరించారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ల భర్తీ ప్రక్రియను చేబడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలతో పాటు తాండాలలో కుడా చౌక ధరల దుకాణాల ఏర్పాటు చేస్తామన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న దొడ్డు రకం బియ్యాన్ని ప్రజలెవ్వరు వినియోగించక పోవడంతో.. దారి మళ్లుతున్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. అందుకే తెల్ల రేషన్ కార్డు దారులందరికి ఇకపై సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా ప్రాంతంలో.. 91 లక్షల 68 వేల 231 రేషన్ కార్డులు ఉందేవన్నారు. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.38 కోట్లని ఆయన సభకు వివరించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఇక్కడి నుండి ఆంద్రప్రదేశ్‌కు చెందిన వారు తమ తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లారని.. 2 లక్షల 46 వేల 324 రేషన్ కార్డులు రద్దు అయినట్లు ఉత్తమ్ వెల్లడించారు. తెలంగాణా ఏర్పడ్డాక 2.7 కోట్ల లబ్ధిదారులకు గాను మొత్తం 89 లక్షల 21 వేల 907 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు.

Whats_app_banner