Mohan Babu Case : మోహన్‌బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు : రాచకొండ సీపీ సుధీర్‌బాబు
Mohan Babu Case : మంచు మోహన్‌బాబు అరెస్టుపై రాచకొండ సీపీ సుధీర్‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మోహన్‌బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదని స్పష్టం చేశారు. మోహన్‌బాబుకు మరోసారి నోటీసులు ఇస్తామని.. స్పందించకపోతే అరెస్టు తప్పదని చెప్పారు. ఆయన ఈనెల 24 వరకు సమయం అడిగారని వివరించారు.
మంచు మోహన్‌బాబు వివాదంపై రాచకొండ సీపీ సుధీర్ బాబు స్పందించారు. మోహన్‌బాబు, మనోజ్ వివాదంలో 3 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని వెల్లడించారు. మోహన్‌బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదన్న సీపీ.. మోహన్‌బాబు దగ్గర మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలని చెప్పారు. మోహన్‌బాబుకు నోటీసులు ఇచ్చామని.. ఈ నెల 24 వరకు సమయం అడిగారని సీపీ సుధీర్‌బాబు చెప్పారు.
'24 లోపు విచారించడంపై కోర్టును అడుగుతాం. రాచకొండ పరిధిలో మోహన్‌బాబుకు గన్ లైసెన్స్ లేదు. మోహన్‌బాబు దగ్గర రెండు గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్, స్పానిష్ మేడ్ రివాల్వర్ ఉంది. మోహన్‌బాబుకు మరోసారి నోటీసులు ఇస్తాం. నోటీసులకు స్పందించకపోతే అరెస్ట్ చేస్తాం' అని రాచకొండ సీపీ సుధీర్‌బాబు స్పష్టం చేశారు.
గన్ సరెండర్..
మోహన్‌బాబు తన లైసెన్స్‌డ్ గన్‌ను సరెండర్ చేశారు. తన పీఆర్వో ద్వారా డబుల్ బ్యారెల్ గన్‌ను ఏపీలోని చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. మంచు మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల వివాదాలు తలెత్తింది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు, కుమారుడు మనోజ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వారి తుపాకుల్ని సరెండర్ చేయమని పోలీసులు ఆదేశించారు.
జల్‌పల్లిలో తన నివాసం వద్ద జరిగిన ఘటనపై మోహన్ బాబు మరోసారి స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిధిని కొట్టలేదని వివరణ ఇచ్చారు. జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఆదివారం సాయంత్రం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లి.. చికిత్స పొందుతున్న జర్నలిస్టును మోహన్‌బాబు, మంచు విష్ణు పరామర్శించారు. అతని కుటుంబసభ్యులకు క్షమాపణ చెప్పారు.
హత్యాయత్నం కేసు..
మోహన్‌బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో ఆయనపై తొలుత బీఎన్‌ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదైంది. ఆ తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు.. 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్‌బాబు మైకు లాక్కుని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానల్ కెమెరామన్ కింద పడ్డాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదైంది.