Ration Mafia : రేషన్ బియ్యం పక్కదారి పట్టేందుకు అసలు కారణాలేంటీ? అక్రమ రవాణా అడ్డుకట్ట మార్గాలేవీ?-ap ration rice illegal transport from village to international mafia chain system behind ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ration Mafia : రేషన్ బియ్యం పక్కదారి పట్టేందుకు అసలు కారణాలేంటీ? అక్రమ రవాణా అడ్డుకట్ట మార్గాలేవీ?

Ration Mafia : రేషన్ బియ్యం పక్కదారి పట్టేందుకు అసలు కారణాలేంటీ? అక్రమ రవాణా అడ్డుకట్ట మార్గాలేవీ?

Bandaru Satyaprasad HT Telugu
Dec 07, 2024 02:20 PM IST

Ration Mafia : తెలుగు రాష్ట్రాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా చాప కింద నీరులా విస్తరిస్తోంది. పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల వ్యయంతో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం....అక్రమార్కుల ఖాతాలు నింపుతున్నాయి.

రేషన్ బియ్యం పక్కదారి పట్టేందుకు అసలు కారణాలేంటీ? అక్రమ రవాణా అడ్డుకట్ట మార్గాలేవీ?
రేషన్ బియ్యం పక్కదారి పట్టేందుకు అసలు కారణాలేంటీ? అక్రమ రవాణా అడ్డుకట్ట మార్గాలేవీ?

'ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ అన్న యోజన' పథకం ద్వారా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం అందిస్తుంది. పేద ప్రజల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో దార్రిద్య రేఖకు దిగువనున్న వారికి తెల్ల రేషన్ కార్డులు జారీ చేసి, ఈ కార్డుదారులకు ప్రతి నెలా బియ్యం, పంచదార, ఇతర నిత్యావసరాలు అందిస్తున్నాయి ప్రభుత్వాలు. కోవిడ్ సంక్షోభానికి ముందు కిలో బియ్యం ఒక్క రూపాయికి అందించేవారు. చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి నెలా పేదలకు సరఫరా చేసేవారు. కోవిడ్ సమయంలో ఎదురైన ఇబ్బందులతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ బియ్యాన్ని పేదలకు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. నాలుగేళ్లుగా రేషన్ దుకాణాల్లో బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. ఇటీవల కేంద్ర కేబినెట్ ఉచిత బియ్యం సరఫరా మరో నాలుగేళ్లు పొడిగించాలని నిర్ణయించింది. పోషకాహార లోపం నివారణకు ఉచిత బియ్యంలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కలుపుతున్నారు. ఒక క్వింటాల్ బియ్యంలో ఒక కిలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కలుపుతున్నారు.

yearly horoscope entry point

ఇక్కడ వరకూ అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా...రేషన్ బియ్యం వెనుక ఓ భారీ మాఫియా విస్తరించింది. ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యాన్ని బాగా పేదరికంలో ఉన్న వారు మాత్రమే తింటున్నారు. మిడిల్ క్లాస్ వాళ్లు, కాస్త ఆర్థిక స్థోమత ఉన్నవారు... రేషన్ బియ్యాన్ని రూ.10-25 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక్కడ నుంచే రేషన్ బియ్యం అక్రమ మార్గం మొదలువుతుంది. ఉచితంగా వచ్చిన బియ్యాన్ని రూ.10-25 లకు విక్రయించుకుని...కాస్త మంచి బియ్యం కొనుగోలు చేయాలని సాధారణ ప్రజలు భావిస్తున్నారు. అయితే కొందరు బియ్యం వ్యాపారులు...రేషన్ బియ్యాన్ని సేకరించి కొన్ని రోజులు నిల్వ ఉంచి..వాటిని సార్టెక్స్, ప్రాసెస్ చేసి మార్కెట్లో అధికధరకు విక్రయిస్తున్నారు. ఇక్కడి వరకు ఇది వ్యాపారమే.

ఊరు నుంచి విదేశాలకు

ఊరూరా రేషన్ బియ్యం సేకరణను ఒక చైన్ ఏర్పాటు చేసి, వాటిని మిల్లులకు చేరవేస్తుంటారు. ఇలా భారీగా సేకరించిన రేషన్ బియ్యాన్ని బడా రైస్ మిల్లుల వ్యాపారులకు విక్రయిస్తుంటారు. ఇలా తరలించినప్పుడే రేషన్ బియ్యం పట్టివేత వార్తలు అడపాదడపా వింటుంటాం. వాస్తవానికి దొరికేది క్వింటాల్లో...తరలిపోయేది టన్నుల్లో అనేది జగమెరిగిన సత్యం. రేషన్ బియ్యాన్ని సేకరించిన బడా వ్యాపారులు...వాటిని ప్రాసెస్ చేసి విదేశాలకు భారీ ధరలకు విక్రయిస్తుంటారు. ఈ వ్యాపారం మొత్తం పోర్టుల ద్వారా జరుగుతోందని ఎప్పటి నుంచో వినిపిస్తున్న, కనిపిస్తున్న వాస్తవం. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 'సీజ్ ది షిప్' ఆదేశాలతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక వేల కోట్ల దందా ఉందని, టన్నుల కొద్ది రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుందని మీడియా కొన్ని రోజులు హడావుడి చేసింది. రేషన్ బియ్యం మాఫియా వెనుక ఉన్న వారెవ్వరో ఇప్పటికైనా బయటపడుతుందా? అంటే వేచి చూడాల్సిందే. చూసేందుకు చాలా చిన్న వ్యాపారంలో ఉన్నా...దీని వెనుక వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఘటనల ద్వారా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ వేసింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

రంగంలోకి సిట్

ఏపీలో రేషన్‌ మాఫియాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్‌ ఛైర్మన్‌గా సీనియర్ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ను నియమించింది. బియ్యం అక్రమ రవాణా కేసులన్నింటనీ సిట్‌ విచారించనుంది. రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులో నమోదైన కేసుల వివరాలను సిట్‌ సేకరిస్తుంది. పలు పోలీస్‌ స్టేషన్లలో జూన్‌, జులై నెలలో 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. డాక్యుమెంట్లలో ఎలా చూపించారో సిట్ ఆరా తీయనుంది. చైన్‌ సిస్టం ఎక్కడ ఉంది.. ఎవరు నడిపిస్తున్నారనే దానిపై సిట్ ఫోకస్‌ పెట్టింది.

సన్నబియ్యం లేదా ఖాతాల్లో డబ్బులు

అసలు పేదలు తినని బియ్యం సరఫరా ఎందుకునే చర్చ సైతం ఇటీవల మొదలైంది. సాధారణ ప్రజలు సైతం సన్నబియ్యం తినాలనుకుంటున్నారు. వందల కోట్లు వెచ్చింది సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం... పక్కదారి పట్టకుండా ప్రభుత్వమే మరో ముందడుగు వేసి రేషన్ బియ్యాన్ని కాస్త సార్టెక్స్ చేసి పంపిణీ చేస్తే... పేద వాడి జేబుకు చిల్లు పడకుండా, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మార్కెట్లో సన్న బియ్యానికి గిరాకీ పెరుగుతున్న క్రమంలో...ప్రభుత్వాలు రైతులను సన్నధాన్యం వైపు మళ్లించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు రేషన్ బియ్యానికి బదులుగా డీబీటీ ద్వారా కిలోకి ఇంత చొప్పున పేదల ఖాతాల్లో నగదు జమ చేయాలనే డిమాండ్ సైతం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం...అక్రమార్కుల ఖాతాలను నింపుతున్నాయి. రేషన్ మాఫియా తెలుగు రాష్ట్రాల్లో విస్తరించడానికి కారణాలు అధ్యయనం చేసి...అడ్డుకట్ట వేయాలని సామాన్యులు కోరుకుంటున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం