Telangana Cabinet Expansion : కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది.. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు?-what are the political reasons for the telangana cabinet expansion not happening ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Cabinet Expansion : కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది.. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు?

Telangana Cabinet Expansion : కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది.. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు?

Basani Shiva Kumar HT Telugu
Dec 16, 2024 12:23 PM IST

Telangana Cabinet Expansion : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది అయ్యింది. కానీ.. మంత్రివర్గం పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. దీనికి అనేక రాజకీయ కారణాలు ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణపై సీఎం, మంత్రులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆశావహులు తమ ప్రయత్నాల్లో ఉన్నారు.

మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు?
మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు?

తెలంగాణలో అసెంబ్లీ స్థానాల ప్రకారం కేబినెట్‌లో 18 మందికి అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా.. ఇంకా కేబినెట్ బెర్తులు ఖాళీగానే ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ బెర్తుల కోసం ఆశావహులు పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అటు క్యాబినెట్ విస్తరణ జరగకపోవడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది.

డిసెంబరు నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై హైకమాండే నిర్ణయం తీసుకుంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారు. ఈ నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి కేబినెట్ గురించి చర్చ జరుగుతోంది. ఇటీవల సీఎం ఢిల్లికి వెళ్లారు. దీంతో మంత్రివర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎంగా రేవంత్ రెడ్డి, మంత్రులుగా మరో 11 మంది ప్రమాణస్వీకారం చేశారు. ఇంకా ఆరుగురికి అవకాశం ఉంది. అయితే.. మంత్రివర్గ విస్తరణపై చర్చల్లో పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి కూడా ఉంటారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీంతో ఆశావహులు ఎవరికివారు మంత్రి పదవి కోసం కీలక నేతల చుట్టూ తిరుగుతున్నారు.

మంత్రివర్గంలో చోటు కోసం పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అదిష్ఠానానికి లేఖ రాశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరికి ఛాన్స్ లేదని.. తనను కెబినెట్‌లోకి తీసుకోవాలని కోరారు. ఆయనతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, వినోద్, వాకటి శ్రీహరి, మదన్ మోహన్ రావు, మైనార్డీ కోటలో షబ్బర్ అలీ, ఫిరోజ్ ఖాన్ తదితరులు మంత్రి పదవులను ఆశిస్తున్నారు.

మహా ఎన్నికల తర్వాత..

ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని అంతా ఆశించారు. అటు మహా ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ ధీమాగా ఉండేది. కానీ.. ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. ఇటు రేవంత్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఫలితాలు సానుకూలంగా వస్తే.. తెలంగాణ కేబినెట్‌ విస్తరణపై అధిష్టానం నిర్ణయం తీసుకునేదని.. కానీ ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో.. మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

రేవంత్‌కు నో అపాయింట్‌మెంట్..

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత.. రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించారని.. కానీ అపాయింట్‌మెంట్ లభించలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు చెప్పారు. సోనియా, రాహుల్‌ను కలిస్తేనే మంత్రివర్గ విస్తరణ అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో అశావహులు నిరాశ చెందుతున్నారు. ఎప్పుడు విస్తరణ జరుగుతుందని ఎదురుచూస్తున్నారు.

Whats_app_banner