Telangana Congress Govt : కాంగ్రెస్ సర్కార్ కు ఏడాది - ఇప్పటివరకు చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలివే
తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది కావొస్తుంది. ఈ డిసెంబర్ 9వ తేదీ నాటికి 365 రోజులు పూర్తి అవుతుంది. ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యంగా అడుగులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం… కొన్నింటిని పట్టాలెక్కించింది. ఈ ఏడాది పాలనలో రేవంత్ సర్కార్ చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలెంటో ఓ లుక్కేద్దాం…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. గత ఏడాది డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగా.. 9వ తేదీన కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. హైదరాబాద్ వేదికగా రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… ప్రధానంగా ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం కూడా ఆరు గ్యారెంటీల హామీలపైనే చేశారు. అంతేకాదు… సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో కూడా ఆరు గ్యారెంటీల హామీల అమలుపైనే చర్చించారు. పథకాల అమలు కోసం ప్రజా పాలన అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని గ్రామాల్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. పథకాల వర్తింపున కోసం వివరాలను సేకరించింది. వివరాలను ఆన్ లైన్ కూడా చేసింది.
ఆరు గ్యారెంటీలే కాకుండా రైతు రుణమాఫీని అత్యంత ప్రతిష్టాత్మకంగా రేవంత్ సర్కార్ తీసుకుంది. ఎన్నికల హామీలో కూడా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించింది. రు. 2 లక్షల రుణమాఫీ అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లటంతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తామని చెప్పింది. దీంతో ఈ విషయంపై రేవంత్ సర్కార్… ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పట్టాలెక్కించింది. మరోవైపు మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించింది.
తమ పాలనకు ఏడాది పూర్తవుతున్న వేళ ప్రజా వియోజయత్సవాలకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. అయితే ఈ ఏడాదిలో కాంగ్రెస్ సర్కార్ చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా క్రోడీకరించి…క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లేలా కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులోని కొన్ని విషయాలను ఇక్కడ చూడండి….
కాంగ్రెస్ ఏడాది పాలన - చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలు:
- డిసెంబర్ 9, 2024వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
- ఆరు గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు.
- రూ. 2 లక్షల రుణమాఫీ స్కీమ్ ను పట్టాలెక్కించారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో అన్నదాతల ఖాతాల్లో డబ్బులను జమ చేశారు.
- కొత్తగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నియామకపత్రాలను అందజేశారు.
- గ్రూప్ 1, 2 పరీక్షలను పూర్తి చేశారు. ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.
- హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటు చేసింది.
- మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
- స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నుంచే కోర్సులను కూడా ప్రారంభించారు.
- స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు.
- గృహా జ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నారు.
- ముచ్చర్లలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు శంకుస్థాపన, ప్రణాళికలు సిద్ధం చేశారు.
- గురుకులాల్లో డైట్ ఛార్జీలను పెంచారు.
- కుల గణన సర్వేను నిర్వహించారు.
- 400,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. త్వరలోనే అర్హులను గుర్తించనున్నారు.
- రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచారు.
- ప్రజా వాణీ కార్యక్రమంలో భాగంగా 500,000 ఫిర్యాదులను స్వీకరించారు.
- అందె శ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించారు.
- టీఎస్ నుంచి టీజీకి వాహనాల రిజిస్ట్రేషన్ మార్పు చేశారు.