Gumasthan Review: ఊహలకు అందని ట్విస్ట్‌లతో సాగే మలయాళం మర్డర్ మిస్టరీ మూవీ ఎలా ఉందంటే?
Gumasthan Review: మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ గుమస్తాన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమల్ కే జాబీ దర్శకత్వం వహించిన సినిమాలో జైస్ జోష్, షాజు శ్రీధర్, బిబిన్ జార్జ్ కీలక పాత్రలు పోషించారు.
Gumasthan Review: జైస్ జోష్, షాజు శ్రీధర్, బిబిన్ జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళం మూవీ గుమస్తాన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి అమల్ కే జాబీ దర్శకత్వం వహించాడు. ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే?
గుమస్తాన్ కథ…
ఆండ్రూస్ పల్లిప్పదన్ (జైస్ జోష్) క్రిమినల్ లాయర్ వద్ద చాలా ఏళ్ల పాటు క్లర్క్‌గా పనిచేస్తాడు. న్యాయం శాస్త్రంలోని లోతుపాతులన్నింటిపై పల్లిప్పదన్‌కు అవగాహన ఉంటుంది. తనకున్న అనుభవంతో కోర్టు కేసుల్లో అవసరమైన వారికి సలహాలు ఇస్తుంటాడు. భార్య లీలా (స్మిను సిజో) తరఫు బంధువులతో పల్లిప్పదన్‌కు గొడవలు ఉంటాయి. ఆ విషయమై ఓ రోజు భర్తను నిలదీస్తుంది లీలా.
ఆవేశంలో భార్యపై చేయిచేసుకుంటాడు పల్లిప్పదన్. ఆ తర్వాత రోజు పనిమనిషి ఇంటికి వచ్చేసరికి పల్లిప్పదన్ భుజంపై రక్తపు మరకలు కనిపిస్తాయి. ఇంట్లోని వస్తువులు చిందర వందరగా ఉంటాయి. భార్య లీలాను పల్లిప్పదన్ హత్య చేశాడని అనుమానిపించిన పనిమనిషి పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది.
ఓ కేసు విషయంలో తన కుటుంబానికి పల్లిప్పదన్ అన్యాయం చేశాడని ఎఎస్ఐ శివరామన్ (షాజు శ్రీధర్) రగిలిపోతుంది. లీలా మర్డర్ కేసు ద్వారా అతడిపై రివేంజ్ తీర్చుకోవాలని భావిస్తాడు. శివరామన్ అన్వేషణలో పల్లిప్పదన్ తన ఇంట్లో ఎవరినో హత్య చేసినట్లుగా ఆధారాలు లభిస్తాయి. లీలానే హత్య గావించబడిందని పోలీసులు అనుమానిస్తుండగా...సడెన్‌గా ఆమె ప్రాణాలతో ప్రత్యక్షమవుతుంది.
ఆ తర్వాత ఏమైంది? పల్లిప్పదన్ చంపింది ఎవరిని? శివరామన్ వేసిన ఎత్తులను తనకున్న లా పరిజ్ఞానంతో పల్లిప్పదన్ ఎలా తిప్పికొట్టాడు? పల్లిప్పదన్ కొడుకు ఎబే (బిబిన్ జార్జ్) ఎలా చనిపోయాడు? తన కొడుకు మరణంపై పల్లిప్పదన్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
మర్డర్ మిస్టరీ…
మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వేస్టిగేషన్ సినిమాల్లో హీరోను పోలీస్ ఆఫీసర్, డిటెక్టివ్, లాయర్‌గానో చూపిస్తూ అతడి కోణం నుంచే కథను నడిపిస్తుంటారు దర్శకులు. కానీ గుమస్తాన్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది. సాధారణ గుమస్తా న్యాయం శాస్త్రంపై తనకున్న పట్టు, తెలివితేటలతో మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు అనే పాయింట్‌ను ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడు డైరెక్టర్.
ట్విస్ట్ రివీల్ కాకుండా...
పల్లిప్పదన్ ఇంట్లో చనిపోయింది ఎవరు? అనే ట్విస్ట్ చివరి వరకు రివీల్ కాకుండా తన స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో దర్శకుడు మాయ చేశాడు. లీలానే చనిపోయిందని పోలీసులు ఫిక్సయ్యే లోపు ఆమె ప్రాణాలతో వారి ప్రత్యక్షమయ్యే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. హీరోతో శత్రుత్వం ఉన్న వాళ్ల లిస్ట్‌ను పోలీసులు సేకరించడం, చనిపోయారని అనుకున్న ఒక్కో పాత్ర పోలీస్ స్టేషన్‌కు వచ్చే సీన్స్ థ్రిల్లింగ్‌ను పంచుతాయి.
ఫ్లాష్‌బ్యాక్ రొటీన్...
ప్రీ క్లైమాక్స్ వరకు కథను ఎంగేజింగ్‌గా నడిపించిన దర్శకుడు చివరలో మాత్రం తడబడిపోయాడు. పల్లిప్పదన్ కొడుకుకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, అతడికి జరిగిన అన్యాయం మాత్రం రొటీన్‌గా అనిపిస్తుంది. మంచి థ్రిల్లర్ మూవీ చూస్తున్న ఫీల్‌తో సినిమా మొదలై...సాదాసీదా రివేంజ్ డ్రామాగా ముగించడం నిరాశపరుస్తుంది. హీరో తెలివితేటల గురించి డైరెక్టర్ ఇచ్చే బిల్డప్పుల కాస్త ఓవర్ అయ్యాయి.
విజయ్ సేతుపతిలా...
గుమస్తా పల్లిప్పదన్‌గా సీరియస్ పాత్రలో జైస్ జోస్ యాక్టింగ్ బాగుంది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కొన్నిచోట్ల విజయ్ సేతుపతిని తలపించాడు. ఏఎస్ఐ శివరాజ్‌గా షాజు శ్రీధర్ పాత్రను హీరోకు ధీటుగా నాచురల్‌గా రాసుకున్నాడు. బిబీన్ జార్జ్, కైలాష్, స్మిను సిజోతో పాటు మిగిలిన వాళ్ల నటన ఓకే అనిపిస్తుంది.
ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ...
లిమిటెడ్ బడ్జెట్‌లో వచ్చిన ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీగా గుమస్తాన్ ఆకట్టుకుంటుంది. అమెజాన్ ప్రైమ్‌లో కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది.