Devendra Fadnavis: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ డిసెంబర్ 5న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ముంబైలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. శాసనసభాపక్ష సమావేశానికి ముందు జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ముఖ్యమంత్రి పదవికి ఖరారు చేశారు.
బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. మహారాష్ట్ర శాసనసభాపక్ష సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీలను బీజేపీ నియమించింది. శాసనసభాపక్ష సమావేశానికి ముందు బీజేపీ నేత సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ మహాయుతి భాగస్వామ్య పక్షాలు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కును కోరుతాయని చెప్పారు. కాగా, దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వంలో శివసేన (షిండే) నేత ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ (ఏపీ) నేత అజిత్ పవార్ లు ఉప ముఖ్యమంత్రులుగా ఉండనున్నారు.
టాపిక్