Naga Chaitanya Sobhita Wedding: పెళ్లితో ఒక్కటైన నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల.. వివాహానికి హాజరైన అతిథులు వీళ్లే!
Naga Chaitanya Sobhita Dhulipala Wedding: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంతో ఎట్టకేలకి ఒక్కటయ్యారు. రెండేళ్లు డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. ఈరోజు పెళ్లి చేసుకుంది.
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంతో బుధవారం ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈరోజు రాత్రి 8 గంటల 13 నిమిషాలకి శోభిత ధూళిపాళ్ల మెడలో నాగచైతన్య మూడు ముళ్లు వేశాడు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహానికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
హాజరైన సెలెబ్రిటీలు
బుధవారం అర్ధరాత్రి వరకూ ఈ వివాహ వేడుకలు కొనసాగనుండగా.. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, తండేల్ మూవీ డైరెక్టర్ చందు మొండేటి, సుహాసిని, అడివి శేష్, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, అల్లు అరవింద్ దంపతులు, కీరవాణి, చాముండేశ్వరినాథ్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇంకా కొంత మంది సెలెబ్రిటీలు వచ్చే అవకాశం ఉంది.
దగ్గుబాటి ఫ్యామిలీ కూడా
వివాహ వేడుక వద్ద అక్కినేని, ధూళిపాళ్ల ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి కుటుంబ సభ్యులు కూడా సందడి చేస్తూ కనిపించారు. చాలా పరిమిత సంఖ్యలో బంధువులతో పాటు సన్నిహితుల్ని ఈ వివాహానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో స్పెషల్‌గా ఒక సెట్‌ను అక్కినేని నాగార్జున ఈ పెళ్లి కోసం వేయించారు. దివంగత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా ఈ సెట్ ఏర్పాటు చేశారు.
నాగచైతన్య, శోభిత కెరీర్
నాగచైతన్య నటించిన తండేల్ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి రాబోతోంది. ఈ మూవీలో నాగచైతన్య సరసన సాయి పల్లవి నటించింది. మరోవైపు శోభిత ఎక్కువగా బాలీవుడ్, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ వచ్చింది. రెండేళ్లు డేటింగ్ చేసిన ఈ జంట ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభిత పెద్ద ప్రాజెక్ట్‌లు ఏవీ ఓకే చేయలేదు.
త్వరలోనే అక్కినేని ఫ్యామిలీలో మరో పెళ్లి
అక్కినేని కుటుంబంలో త్వరలోనే మరో వివాహం కూడా జరగనుంది. ఇటీవల అక్కినేని అఖిల్ కూడా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అఖిల్ పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే అక్కినేని నాగార్జున జరిపించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.