Naga Babu Tweet: పుష్ప 2 రిలీజ్ ముంగిట నాగబాబు ట్వీట్.. అల్లు అర్జున్ పేరుని ప్రస్తావించకుండా మెగా ఫ్యాన్స్‌కి హింట్
Pushpa 2 Release: పుష్ప 2 రిలీజ్ ముంగిట ఎట్టకేలకి మెగా ఫ్యామిలీ నుంచి స్పందన వచ్చింది. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇండస్ట్రీలోని చాలా మంది స్పందించిన.. మెగా ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్క ట్వీట్ కూడా రాలేదు. అయితే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ రిలీజ్ ముంగిట నాగబాబు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. డిసెంబరు 5 (గురువారం) ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప 2: ది రూల్’ మూవీ రిలీజ్‌కాబోతోంది. రికార్డు స్థాయిలో 12,500 థియేటర్లలో విడుదల అవుతుండగా.. దేశం మొత్తం ఇప్పుడు ఈ మూవీ వైపు చూస్తోంది. ఈ దశలో నాగబాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కానీ.. ఎక్కడా పుష్ప 2 లేదా అల్లు అర్జున్ పేరుని నాగబాబుని ప్రస్తావించకపోవడం గమనార్హం.
పుష్ప 2కి సపోర్ట్ చేసినట్లా?
‘‘24 క్రాఫ్ట్ ల కష్టంతో.. వందల మంది టెక్నీషన్ల శ్రమతో.. వేల మందికి ఉపాధి కలిగించి.. కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరినీ అలరించే సినిమాని సినిమాలానే ఆదరించాలని.. ప్రతి మెగా అభిమానిని, ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను’’ అని నాగబాబు ట్వీట్ చేశారు. అంటే పుష్ప 2 సినిమాని మెగా అభిమానులు ఆదరించాలని పరోక్షంగా నాగబాబు సూచించినట్లు తెలుస్తోంది.
పరాయివాడు ట్వీట్ దుమారం
ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో.. అప్పట్లో నాగబాబు వివాదాస్పద రీతిలో ఒక ట్వీట్ చేశారు. ‘‘మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే’’ అంటూ రాసుకొచ్చారు. దాంతో అప్పట్లో ఈ ట్వీట్‌పై దుమారం రేగడంతో.. డిలీట్ చేయాల్సి వచ్చింది. అంతేకాదు.. కొన్ని రోజులు ట్విట్వర్‌కి దూరంగా ఉండాల్సి వచ్చింది.
మెగా ఫ్యామిలీ రియాక్ట్ అవుతుందా?
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన పుష్ప 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారని తొలుత ప్రచారం జరిగింది. కానీ.. ఎస్‌ఎస్ రాజమౌళితో అల్లు అర్జున్ సరిపెట్టారు. దాంతో మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందని అంతా అనుకున్నారు. తాజాగా నాగబాబు ట్వీట్‌తో ఆ కోల్డ్ వార్‌పై మరింత స్పష్టత వచ్చింది. పుష్ప 2పై ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు స్పందించారు. రిలీజ్ తర్వాత కూడా స్పందించే అవకాశాలు లేకపోలేదు. కానీ.. మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.