Nandikotkur School Incident : నందికొట్కూరులో తీవ్ర విషాదం, పాఠశాల గోడ కూలి మూడో తరగతి విద్యార్థిని మృతి
Nandikotkur School Incident : నంద్యాల జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. పాఠశాల గోడ కూలి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. కాసేపట్లో ఇంటికి వెళ్లాల్సిన విద్యార్థిని విగత జీవిగా మారింది. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాఠశాల గోడ కూలి మూడో తరగతి విద్యార్థిని మృతి చెందింది. నందికొట్కూరు విద్యానగర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ గోడ కూలి మూడో తరగతి విద్యార్థిని మహిన్(8) పై పడింది. ఈ దుర్ఘటనలో చిన్నారి మహిన్ అక్కడికక్కడే మృతి చెందింది. బుధవారం స్కూల్ అయిపోయాక విద్యార్థులందరూ ఒక్కసారిగా బయటకు వస్తున్న క్రమంలో స్కూల్ మెయిన్ గేటు గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో గోడ చిన్నారి మహిన్ పై పడింది. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సంఘటనా స్థలాన్ని మున్సిపల్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య పరిశీలించారు. ఎమ్మెల్యే జయసూర్య ఆసుపత్రికి వెళ్లి చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వపరంగా విద్యార్థి కుటుంబాన్ని అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గోడ కూలిపోయే పరిస్థితిలో ఉన్నా...నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఎమ్మెల్యేను కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తల్లి తిట్టిందని 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
తల్లి మందలించిందని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. చున్నీతో ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆళ్లగడ్డ పుల్లారెడ్డి వీధికి చెందిన ఆదిలక్ష్మి, ఓబులేసుల దంపతుల కుమార్తె స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్ లో 8వ తరగతి చదువుతోంది. పరీక్ష రాసేందుకు వెళ్లాలని విద్యార్థినిని తల్లి మందలించడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. విద్యార్థిని గమనించిన స్థానికులు కాపాడి, ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. పాప ఆరోగ్యం విషమంగా ఉండడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కీచక టీచర్
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గత మూడు నెలలుగా ఈ వేధింపులు సాగిస్తున్నాడు. లైంగిక వేధింపుల గురించి చెప్పలేక విద్యార్థినులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఈ విషయం బయటపడటంతో ఆ ఉపాధ్యాయుడికి విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు ఆ కీచక ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని ఒక గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్తు పాఠశాలలో చోటుచేసుకుంది. 1998లో డీఎస్సీ క్వాలిఫై అయిన పిండి శ్రీనివాస్‌కు మూడేళ్ల క్రితం మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. 2023 జూన్ 26న పి.గన్నవరం మండలంలోని ప్రస్తుతం పని చేసే ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వచ్చారు. పాఠశాలలోని 4, 5 తరగతుల విద్యార్థినులను మూడు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు టీచర్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
సంబంధిత కథనం