Tirumala Laddu : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఇకపై అడిగినన్ని లడ్డూలు
Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ పంపిణీపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. అదనంగా రోజుకు 50 వేల చిన్న లడ్డూలు, 4 వేల పెద్ద లడ్డూలు, 3500 వడలు తయారీకి టీటీడీ సిద్ధమైంది. ఈ మేరకు పోటు సిబ్బందిని నియమించనుంది.
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు తమకు ఎంతో ప్రియమైన లడ్డూలు కొనుగోలు చేస్తారు. శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు అదనంగా లడ్డూల తయారీకి అవసరమైన పోటు సిబ్బంది నియమించేందుకు సిద్ధమైంది. టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, ఆరు వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేస్తుంటారు. తిరుమలతోపాటు తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని ఆలయాల్లో లడ్డూ ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూను ఉచితంగా అందిస్తారు. రోజుకు సుమారు 70 వేల మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అంటే 70 వేల ఉచిత లడ్డూలు భక్తులకు అందిస్తారు. భక్తులు తమ బంధువులు, స్నేహితుల కోసం అదనంగా లడ్డూలు కొనుగోలు చేస్తారు. దర్శనానికి వెళ్లకుండా లడ్డూలు కొనుగోలు చేయాలనుకునే భక్తులకు ఆధార్ కార్డుపై రెండు లడ్డూలను రూ. 50లకు విక్రయిస్తారు. వారాంతాలు, ప్రత్యేక రోజుల్లో తిరుమల లడ్డూలకు అధిక డిమాండ్ ఉంటుంది. లడ్డూలకు భక్తుల నుంచి ఉన్న డిమాండ్ ఆధారంగా అదనంగా లడ్డూలు తయారీ చేయాలని టీటీడీ ప్రత్యేక చర్యలు చెప్పట్టింది. డిమాండ్ ఆధారంగా 50 వేల చిన్న లడ్డూలు తయారీకి టీటీడీ సిద్ధం అవుతుంది. దీంతో పాటు 4 వేల పెద్ద లడ్డూలు, 3500 వడలు తయారు చేయాలని టీటీడీ యోచిస్తుంది. వీటని దృష్టిలో ఉంచుకుని పోటు సిబ్బందికి అదనంగా మరో 74 మంది శ్రీవైష్ణవులతోపాటు మరో పది మంది శ్రీవైష్ణవులు కానివారిని నియమించాలని టీటీడీ నిర్ణయించింది.
శ్రీవారి హుండీ ఆదాయం - వరుసగా 33వ నెల రూ.100 కోట్ల మార్క్ ఆదాయం
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రూ.100 కోట్ల మార్క్ దాటింది. వరుసగా 33వ నెల రూ.100 కోట్ల మార్క్ దాటినట్లు టీటీడీ ప్రకటించింది. నవంబర్ నెలలో స్వామివారి హుండీ ఆదాయం రూ.111 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. ఈ ఏడాది 11 నెలల్లో హుండీ ద్వారా రూ.1,253 కోట్లి ఆదాయం వచ్చినట్లు తెలిపింది. నిత్యం శ్రీవారి వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. దర్శనం అనంతరం తమకు తగిన విధంగా హుండీ కానుకలు సమర్పించుకుంటారు. స్వామివారికి నిత్యం మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు హుండీ ఆదాయం వస్తుంటుంది. దీంతో నెలకు రూ.100 కోట్లు పైగా శ్రీవారి హుండీ ఆదాయం లభిస్తుంది. ఏడాదికి హుండీ ద్వారా సుమారు రూ.1300 కోట్ల ఆదాయం వస్తుందని టీటీడీ లెక్కలు చెబుతున్నాయి.
కరోనా సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం కాస్త తగ్గింది. 2022 మార్చి నెల నుంచి ప్రతి నెలా హుండీ ఆదాయం రూ. 100 కోట్ల మార్క్ ను దదాటుతోంది. ఈ ఏడాది జనవరిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.116 కోట్లు, ఫిబ్రవరిలో రూ.112 కోట్లు, మార్చిలో రూ.118 కోట్లు, ఏప్రిల్ లో రూ.101 కోట్లు, మేలో రూ.108 కోట్లు, జూన్ నెలలో రూ.114 కోట్లు, జులైలో రూ. 125 కోట్లు, ఆగస్టులో రూ.126 కోట్లు, సెప్టెంబర్ లో రూ.114 కోట్లు, అక్టోబర్ లో రూ.127 కోట్లు, నవంబర్ నెలలో రూ.111 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. డిసెంబర్ నెల హుండీ ఆదాయంతో కలిపితే రూ.1350 కోట్ల పైగా ఆదాయం సమకూరే అవకాశాలు ఉందని తెలుస్తోంది.
సంబంధిత కథనం