Pushpa 2 Posters : పుష్ప 2 కు రాజకీయ రంగు..! బ్యానర్లపై జగన్ ఫొటోలు, పిఠాపురంలో పోస్టర్ల చించివేత
పుష్ప 2 సినిమాపై రాజకీయం రగడ నెలకొంది. పిఠాపురంలో సినిమా పోస్టర్లను చించివేసిన ఘటనలు వెలుగు చూశాయి. మరోవైపు అనంతపురం జిల్లాలో పుష్ప 2 పోస్టర్లపై జగన్ ఫొటోలు దర్శనమిచ్చాయి. దీంతో పుష్ప సినిమాకు రాజకీయ రంగు అంటుకున్నట్లు అయింది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా డిసెంబర్ 5న థియేటర్‌ల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. టిక్కెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోలకు టిక్కెట్టు ధర రూ.800గా పెంచారు. అలాగే మొదటి రోజు డిసెంబర్ 5 తేదీన సింగిల్ స్క్రీన్‌లలో లోయర్ క్లాస్ టిక్కెట్టు రూ.100, అప్పర్ క్లాస్ టిక్కెట్టు రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200కు పెంచారు. డిసెంబర్ 17 వరకు ఈ ధరలు అమలులో ఉంటాయి. టిక్కెట్ల పెంపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
పిఠాపురంలో చించివేత…!
ఇదిలా ఉండగా పిఠాపురంలో పుష్ప-2 సినిమా పోస్టర్లను చించివేశారు. పిఠాపురం మొత్తం పోస్టర్ల చించివేత కనిపించింది. మరోవైపు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అల్లు అర్జున్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీల్లో ‘మా కోసం నువ్వు వచ్చావు. మీ కోసం మేమొస్తాం. తగ్గేదేలే’ అంటూ నినాదాలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు పుష్ప-2 సినిమా మద్దతుగా బ్యానర్లు కడుతున్నారు.
ఎన్నికల్లో శిల్పాకు మద్దతు…
అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్నూలు జిల్లా నంద్యాలులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డికి మద్దతుగా ఆయన నివాసానికి అల్లు అర్జున్ వెళ్లారు. అప్పటి నుంచి అల్లు అర్జున్‌ని జనసేన శ్రేణులు టార్గెట్ చేస్తూ వచ్చాయి. కట్ చేస్తే పిఠాపురంలో పవన్ కళ్యాన్ పోటీ చేశారు. పవన్ కళ్యాన్‌కు మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు నాగబాబు, అల్లు అరవింద్, సాయి ధరమ్‌తేజ్, వరుణ్ తేజ్ వంటివారు మాత్రమే ప్రచారం చేశారు. అల్లు అరవింద్ వచ్చినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం పిఠాపురం ప్రచారానికి రాలేదు. కానీ నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు.
పవన్ ప్రచారానికి రాకపోగా, ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థికి మద్దతుగా వెళ్లడంతో జనసేన శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. దీంతో జనసేన నేతలు అల్లు అర్జున్‌పై విమర్శల దాడి ఎక్కు పెట్టారు. ఇదే సమయంలో సినిమా విడుదల కూడా వాయిదా పడింది. దీంతో డైలాగ్ వార్ కు బ్రేక్ ఇచ్చినట్లు అయింది.
ఇటీవలి సినిమా విడుదలకు తేదీ ప్రకటించిన తరువాత మళ్లీ రగడ షురూ అయింది. జనసేన నాయకులు పెద్దగా స్పందించకపోయినా, జనసేన కార్యకర్తలు మాత్రం దీనిపై సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలి నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి కూడా అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తరువాత ఆ పోస్టును డిలీట్ చేశారు.
పుష్ప-2కు, అల్లు అర్జున్‌కు మద్దతుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి నేతలు నేతలు మాట్లాడుతూ…. పుష్ప 2 ను ఎవ్వరూ అడ్డుకోలేరని, ఈ సినిమాతో అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్ కు ఎదిగారని పొగడ్తలు కురిపించారు. అదే కొందరికి జెలసీగా మారిందంటూ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలతో పుష్ప 2కు పొలిటికల్ రంగు పులిమినట్లు అయింది. మరోవైపు పుష్ప 2 విడుదలకు సిద్ధమైన తరుణంలో బన్నీ ఫ్యాన్స్ సంబరాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం