YSRCP : హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదు.. చంద్రబాబు పాలనలో పథకాలు ఉండవు.. వైసీపీ సెటైర్లు
YSRCP : పథకాల అమలు, ప్రజల అభిప్రాయంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. స్కీమ్స్ గురించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. దీనిపై వైఎస్సార్సీపీ సెటైర్లు వేసింది. నేతి బీరకాయలో నెయ్యి వుండదు.. అలాగే చంద్రబాబు పాలనలో ఉత్తుత్తి పేర్లే తప్ప పథకాలు ఉండవని ఎద్దేవా చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలు, గ్రీవెన్స్‌లో వచ్చే వినతుల పరిష్కారంపై కూటమి సర్కారు ఫోకస్ పెట్టింది. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఐవీఆర్‌ఎస్ ద్వారా లబ్ధిదారులకు ఫోన్ చేసి.. పథకాల అమలు, వినతుల పరిష్కారం తదితర అంశాలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. ప్రజాభిప్రాయం ఆధారంగా పథకాలు, అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నిర్ణయంపై వైఎస్సార్సీపీ సెటైర్లు వేసింది. 'హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదు. మైసూర్ బొండాలో మైసూర్ ఉండదు. నేతి బీరకాయలో నెయ్యి వుండదు. అలాగే చంద్రబాబు పాలనలో ఉత్తుత్తి పేర్లే తప్ప పథకాలు ఉండవు. చేసిందంతా చేసి.. పథకాలన్నీ ఎత్తేసి ఇప్పుడు మహానటి అవతారం ఎత్తిన చంద్రబాబు.. ఏమీ తెలియనట్టు ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారట. మిమ్మల్ని భలే నమ్మించాను.. బాగా వెన్నుపోటు పొడిచాను కదా..నొప్పిగా ఉందా..హాయిగా ఉందా.. అంటూ అభిప్రాయాలు సేకరిస్తారట' అని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.
కూటమి ప్రభుత్వం తెచ్చిన నూతన మద్యం విధానం, ఉచిత ఇసుక విధానం సహా ఇతర నిర్ణయాలపై ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అలాగే రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ కీలక శాఖల్లో అందుతున్న సేవలపైనా సమాచారం సేకరించనున్నారు. ఈ ప్రాసెస్‌లో ఒకవేళ ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమైతే.. కారణాలు విశ్లేషించి సేవలను మెరుగుపర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
అధికారుల్లో బాధ్యత పెంచి మెరుగైన సేవలు అందేలా చూడాలనే ఈ కార్యక్రమం చేపట్టినట్టు కూటమి నేతలు చెబుతున్నారు. ప్రజల మాటే ఫైనల్.. అనే నినాదంతో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్టు స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగానే ఐవీఆర్‌ఎస్ కాల్స్‌కు ప్రజలు స్పందించి, సమాధానాలు చెప్పాలని ప్రభుత్వం కోరుతోంది.