వైఎస్సార్సీపీకి మరో షాక్.. విశాఖలో అక్రమంగా కార్యాలయ నిర్మాణంపై నోటీసులు-after tadepalli office demolished ysrcp receives notice over illegal construction of office in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  వైఎస్సార్సీపీకి మరో షాక్.. విశాఖలో అక్రమంగా కార్యాలయ నిర్మాణంపై నోటీసులు

వైఎస్సార్సీపీకి మరో షాక్.. విశాఖలో అక్రమంగా కార్యాలయ నిర్మాణంపై నోటీసులు

HT Telugu Desk HT Telugu
Jun 22, 2024 07:46 PM IST

తాడేపల్లిలోని తమ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసిన కొన్ని గంటల్లోనే వైజాగ్‌లో పార్టీ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించారంటూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో నోటీసు అందింది.

తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేస్తున్న దృశ్యం
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేస్తున్న దృశ్యం (PTI)

విశాఖపట్నం: తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసిన కొన్ని గంటల్లోనే వైజాగ్‌లోని పార్టీ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించారంటూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు అందాయి.

విశాఖ జిల్లా యెండాడలో సర్వే నంబర్ 175/4లో అనుమతులు లేకుండా రెండెకరాల భూమిలో కార్యాలయం నిర్మించడంపై జీవీఎంసీ కార్పొరేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ ప్రాంతం జీవీఎంసీ పరిధిలోకి వస్తుందని, జీవీఎంసీకి బదులుగా విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ)కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ విషయంపై వారం రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని జోన్-2 టౌన్ ప్లానింగ్ అధికారి వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు.

"అందువల్ల, మీరు/మీ అధీకృత ఏజెంట్ ద్వారా రాతపూర్వకంగా కారణాన్ని చూపించాలని మిమ్మల్ని ఆదేశిస్తున్నాం. ఈ నోటీసు అందిన తేదీ నుంచి ఏడు రోజుల్లోగా పనులు నిలిపివేసి సమాధానం ఇవ్వాలి. లేనిపక్షంలో తగిన ప్రక్రియ ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం..’ అని నోటీసులో పేర్కొన్నారు.

దీంతో సరైన అనుమతులు లేకుండా నిర్మించిన విశాఖ వైసీపీ కార్యాలయాన్ని కూడా కూల్చివేసే అవకాశం ఉందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన నిర్మాణంలో ఉన్న కేంద్ర కార్యాలయ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ శనివారం తెల్లవారుజామున కూల్చివేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటన ద్వారా రాబోయే ఐదేళ్ల పాలన ఎలా ఉండబోతుందో కొత్త టీడీపీ ప్రభుత్వం హింసాత్మక సందేశాన్ని ఇచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగడం ద్వారా చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘తాడేపల్లిలో దాదాపుగా పూర్తయిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఓ నియంత కూల్చివేశాడు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగయ్యాయి..’ అని పేర్కొన్నారు.

తమ పార్టీ తలవంచదని, గట్టిగా పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘ఈ బెదిరింపులు, ఈ హింసాత్మక చర్యలకు వైసీపీ లొంగదు, వెనక్కి తగ్గేది లేదు. ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజలతో కలిసి పోరాడతామన్నారు. చంద్రబాబు దుశ్చర్యలను దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని కోరుతున్నాను' అని జగన్ పేర్కొన్నారు. (ఏఎన్ఐ)

Whats_app_banner