Shani Mantras: శనివారం నాడు ఈ శక్తివంతమైన మంత్రాలను పఠించారంటే ఏలినాటి శని నుంచి కూడా తప్పించుకోవచ్చు
Shani Mantras: శని అనుకూలంగా లేకపోతే వ్యక్తి జీవితం అల్లకల్లోలం అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున శని భగవానుడి మంత్రాలను పఠించడం ద్వారా శని వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
జ్యోతిషశాస్త్రంలో శని ఒక ముఖ్యమైన గ్రహం. ఈ గ్రహం వ్యక్తి సామాజిక, ఆర్థిక, ధార్మిక విషయాలపై ప్రభావం చూపుతుంది. శని గ్రహం అనేది న్యాయం, శ్రమ, కర్మలకు ప్రతీకగా నిలుస్తుంది. శని అనుకూలంగా లేకపోతే వ్యక్తి జీవితంలో కష్టాలు, తప్పిదాలు, పరీక్షలు, సవాళ్లు ఎదురవుతాయని నమ్మిక.అయితే శని కేవలం కర్మ ఫలితాలను మాత్రమే ఇస్తాడనీ మంచి చేసే వారికి శుభమే కలిగిస్తాడనీ చెబుతారు. అంతేకాదు ఈ కష్టాలన్నీ శని గ్రహం మనకు నేర్పించదలచిన పాఠాలనీ, ఆత్మవికాసంకి మార్గం చూపించే అవకాశాలనీ భావిస్తారు.
శనివారం అనేది శని గ్రహానికి అంకితం చేయబడిన రోజు. హిందూ సంప్రదాయాల ప్రకారం.. శని ప్రభావాన్ని తగ్గించడానికి, శని భగవానుడి ఆశీర్వాదం పొందేందుకు ఈ రోజు ప్రత్యేక పూజలు, జపాలు చేసేవారు.ఈ రోజు శని భగవానుడిని పూజించడం వల్ల శాంతి, సంపన్నత, ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం. శనివారం రోజున కొన్ని మంత్రాలను పఠించడం వల్ల జీవితంలోని ప్రతికూల శక్తులను తరిమికొట్టవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.శనివారం రోజున శని దేవుడి ఆశీర్వాదం కోసం ఈ మంత్రాలను జపించడం ద్వారా శాంతి, ధన లాభంతో పాటు జీవితంలో సామరస్యం, సంతులనం, ప్రశాంతత, శ్రేయస్సు కలుగుతుందని నమ్మిక.
శని దేవుడి ఆశీర్వాదం కోసం శనివారం నాడు పఠించాల్సిన శక్తివంతమైన మంత్రాలు:
1. శని మహామంత్రం
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయామార్తండ సంభూతం తం నమామి శనైశ్చరమ్
ప్రయోజనాలు:
శనివారం రోజున ఈ మంత్రం పఠించడం శని భగవానుడి ఆశీర్వాదం కోసం శక్తివంతమైన మార్గం. ఇది అడ్డంకులను అధిగమించడంలో, కష్టాలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. దీనిని పఠించడం ద్వారా మనస్సు శాంతి పొందుతుందని, వ్యక్తి జీవితంలో సమతుల్యత ఏర్పడుతుందని విశ్వాసం.
2. శని గాయత్రీ మంత్రం
ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మన్దః ప్రచోదయాత్
ప్రయోజనాలు:
ఏలినాటి శని కాలంలో ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఈ మంత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శని ప్రభావాన్ని సానుకూలంగా మారుస్తుంది, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి చురుకైన సహాయాన్ని అందిస్తుంది. శనివారం రోజున ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదమని నమ్మిక.
3. శని మూల మంత్రం
ఓం శం శనైశ్చరాయ నమః
ఓం శం శనైశ్చరాయ నమః
ప్రయోజనాలు:
ఈ మంత్రం శాంతిని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక ఉపశమనాన్ని అందిస్తుంది. దీని పఠనంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. భావోద్వేగాలు నియంత్రించడంలో ఇది చక్కగా సహాయపడుతుంది. శనివారం నాడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మనస్సుకు శాంతి చేకూరుతుంది. చికాకు, ఒత్తిడి వంటివి దూరమవుతాయి.
4. శని బీజ మంత్రం
ఓం ప్రాణం ప్రియం ప్రౌం సః శనైశ్చరాయ నమః
ఓం ప్రాం ప్రియం ప్రౌం సః శనైశ్చరాయ నమః
ప్రయోజనాలు:
ఈ బీజ మంత్రం శని గ్రహ ప్రభావాలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. సాడే సతి లేదా ఏలినాటి శని ప్రభావం ఎదుర్కుంటున్న వ్యక్తులు శనివారం నాడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా తప్పకుండా ప్రయోజనాలను పొందవచ్చు.