TG SSC Exams 2025 : వెనక్కి తగ్గిన విద్యాశాఖ - ఈసారి పాత విధానంలోనే 'పదో తరగతి' పరీక్షలు, గ్రేడింగ్ విధానం ఎత్తివేత-education department has once again made an important announcement telangana tenth class exams 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Ssc Exams 2025 : వెనక్కి తగ్గిన విద్యాశాఖ - ఈసారి పాత విధానంలోనే 'పదో తరగతి' పరీక్షలు, గ్రేడింగ్ విధానం ఎత్తివేత

TG SSC Exams 2025 : వెనక్కి తగ్గిన విద్యాశాఖ - ఈసారి పాత విధానంలోనే 'పదో తరగతి' పరీక్షలు, గ్రేడింగ్ విధానం ఎత్తివేత

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 30, 2024 06:35 AM IST

Telangana SSC Exams 2025 : తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల్లో మార్పులపై విద్యాశాఖ వెనక్కి తగ్గింది. ఇంటర్నల్ మార్కులు ఎత్తివేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని సవరణ ఉత్తర్వుల జారీ చేసింది.

తెలంగాణ పదో తరగతి పరీక్షలు
తెలంగాణ పదో తరగతి పరీక్షలు (HT_PRINT)

పదో తరగతి పరీక్షల్లో మార్పులపై తెలంగాణ విద్యాశాఖ మరోసారి కీలక ప్రకటన చేసింది. ఇటీవలనే పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల తొలగింపు, గ్రేడింగ్ విధానం ఎత్తివేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈసారి పరీక్షల్లోనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేసింది. అయితే కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే  విద్యాశాఖ వెనక్కి తగ్గింది. తాజాగా సవరణ ఉత్తర్వులను జారీ చేసింది.

ఇంటర్నల్ మార్కుల తొలగింపు ఈసారికి ఉండదని స్పష్టం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం(2025-26) నుంచి వంద మార్కుల విధానం ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈసారి పరీక్షల్లో వార్షిక పరీక్షలో 80 మార్కులు, ఇంటర్నల్ పరీక్షలకు 20 మార్కులు ఉంటాయని తెలిపింది. ఇక ఈసారి నుంచే గ్రేడింగ్ విధానం ఎత్తివేయనుంది. గతంలో మాదిరిగా గ్రేడింగ్స్ కాకుండా మార్కులను ప్రకటించనున్నారు.

టెన్త్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు:

మరోవైపు తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజును స్వీకరిస్తున్నారు. నవంబర్ 28వ తేదీ వరకు ఎలాంటి రుసుం లేకుండా విద్యార్థులు ఫీజు చెల్లించారు. మరోవైపు నిర్దేశించిన గడువు దాటడంతో… రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 2 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 12 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇక రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 21 వరకు చెల్లించుకునే అవకాశం ఉంటుంది.

రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 ఫీజు చెల్లించాలి. మూడు పేపర్ల లోపు ఉంటే రూ. 110గా చెల్లించాలి. మూడు పేపర్ల కంటే ఎక్కువ బ్యాక్ లాగ్స్ ఉన్న విద్యార్థులు రూ. 125 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ. 60 చెల్లించాలి. https://www.bse.telangana.gov.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపు…

మరోవైపు ఫీజు చెల్లింపు ఇబ్బందులకు పరిష్కరించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. ఆన్ లైన్ లోనే పరీక్షల ఫీజును చెల్లించేలా ఆప్షన్ తీసుకొచ్చింది. పరీక్షల ఫీజు చెల్లించాలంటే విద్యార్ధులు చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫీజు రుసుం కట్టాలి.

ప్రధానోపాధ్యాయుడు లేదా పాఠశాలల సిబ్బంది బ్యాంకుకు వెళ్లి చలానా తీసేవారు. ఇదంతా కూడా పని భారంగా మారిపోయింది. ఈ సమస్యలకు చెక్ పెట్టేలా వెబ్ సైట్ లో ఆన్ లైన్ పేమెంట్ ఆప్షన్ తీసుకొచ్చారు. ప్రాధానోపాధ్యాయులకు కేటాయించే వివరాల ద్వారా లాగిన్ అవుతారు. నేరుగా ఆన్ లైన్ లోనే ఫీజు చెల్లిస్తారు. ఫీజు చెల్లించిన 24 గంటల్లోపు స్టేటస్ అప్డేట్ అవుతుంది. https://bse.telangana.gov.in/SSCADMFRFY/Account/Login.aspx  లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫీజుల చెల్లింపుల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించేలా పరీక్షల విభాగం మరికొన్ని చర్యలను కూడా చేపట్టింది. జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించటంతో పాటు హెల్ప్ లైన్ నెంబర్లను కూడా తీసుకొచ్చింది.

Whats_app_banner