TG SSC Exams 2025 : ఇంటర్నల్ మార్కులు రద్దు..! తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు-changes in 10th class exams in telangana latest updates know here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Ssc Exams 2025 : ఇంటర్నల్ మార్కులు రద్దు..! తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు

TG SSC Exams 2025 : ఇంటర్నల్ మార్కులు రద్దు..! తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 28, 2024 08:01 PM IST

Telangana SSC Exams 2025 : పదో తరగతి మార్కుల విధానంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఇకపై 100 మార్కులకు ఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి.

తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో మార్పులు
తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో మార్పులు (HT_PRINT)

తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఇకపై వంద మార్కులకు ఎగ్జామ్ జరగనుంది. ఇంటర్నల్‌ మార్కులను పూర్తిగా ఎత్తివేసింది. ఇప్పటి వరకు 80 మార్కులకు వార్షిక పరీక్ష జరగగా… 20 మార్కులు ఇంటర్నల్‌ కోసం కేటాయించారు. అయితే సర్కార్ తాజా నిర్ణయంతో 100 మార్కులకు ఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు:

మరోవైపు తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజును స్వీకరిస్తున్నారు. నవంబర్ 28వ తేదీ వరకు ఎలాంటి రుసుం లేకుండా విద్యార్థులు ఫీజు చెల్లిచుకోవచ్చు. మరోవైపు నిర్దేశించిన గడువు దాటితే… రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 2 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 12 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇక రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 21 వరకు చెల్లించుకునే అవకాశం ఉంటుంది.

  • రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 ఫీజు చెల్లించాలి.
  • మూడు పేపర్ల లోపు ఉంటే రూ. 110గా చెల్లించాలి. మూడు పేపర్ల కంటే ఎక్కువ బ్యాక్ లాగ్స్ ఉన్న విద్యార్థులు రూ. 125 చెల్లించాలి.
  • ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ. 60 చెల్లించాలి.
  • https://www.bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపు…

మరోవైపు ఫీజు చెల్లింపు ఇబ్బందులకు పరిష్కరించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. ఆన్ లైన్ లోనే పరీక్షల ఫీజును చెల్లించేలా ఆప్షన్ తీసుకొచ్చింది. పరీక్షల ఫీజు చెల్లించాలంటే విద్యార్ధులు చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫీజు రుసుం కట్టాలి.

ప్రధానోపాధ్యాయుడు లేదా పాఠశాలల సిబ్బంది బ్యాంకుకు వెళ్లి చలానా తీసేవారు. ఇదంతా కూడా పని భారంగా మారిపోయింది. ఈ సమస్యలకు చెక్ పెట్టేలా వెబ్ సైట్ లో ఆన్ లైన్ పేమెంట్ ఆప్షన్ తీసుకొచ్చారు. ప్రాధానోపాధ్యాయులకు కేటాయించే వివరాల ద్వారా లాగిన్ అవుతారు. నేరుగా ఆన్ లైన్ లోనే ఫీజు చెల్లిస్తారు. ఫీజు చెల్లించిన 24 గంటల్లోపు స్టేటస్ అప్డేట్ అవుతుంది. https://bse.telangana.gov.in/SSCADMFRFY/Account/Login.aspx లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫీజుల చెల్లింపుల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించేలా పరీక్షల విభాగం మరికొన్ని చర్యలను కూడా చేపట్టింది. జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించటంతో పాటు హెల్ప్ లైన్ నెంబర్లను కూడా తీసుకొచ్చింది.

Whats_app_banner

సంబంధిత కథనం