TG Rythu Runa Mafi : మరో 3 లక్షల మందికి రుణమాఫీ... 30వ తేదీన ఖాతాల్లోకి డబ్బులు - కీలక ప్రకటన-agri minister tummala nageshwararao key statement about rythu runa mafi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Rythu Runa Mafi : మరో 3 లక్షల మందికి రుణమాఫీ... 30వ తేదీన ఖాతాల్లోకి డబ్బులు - కీలక ప్రకటన

TG Rythu Runa Mafi : మరో 3 లక్షల మందికి రుణమాఫీ... 30వ తేదీన ఖాతాల్లోకి డబ్బులు - కీలక ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 28, 2024 03:45 PM IST

Telangana Rythu Runa Mafi : రుణమాఫీ కాని రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల గుడ్ న్యూస్ చెప్పారు. వివిధ సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని 3 లక్షల మందికి రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు. నవంబర్ 30వ తేదీన వారి ఖాతాల్లో డబ్బులు వేయనున్నట్లు పేర్కొన్నారు.

రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ స్కీమ్ ను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో అధిక సంఖ్యలో రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. వారి వివరాలను సేకరించింది. కుటుంబ నిర్ధారణ చేసేందుకు మూడు నెలలపాటు సమయం తీసుకుంది. ఈ ప్రక్రియ పూర్తి కావటంతో రుణమాఫీ కాని వారికి స్కీమ్ ను వర్తింపజేయనుంది.

మంత్రి తుమ్మల కీలక ప్రకటన…

రుణమాఫీ కాని వారిని డబ్బులు జమ చేయటంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. బుధవారం షాద్ నగర్ లో మాట్లాడిన ఆయన…పలు కారణాలతో రుణమాఫీ జరగని 3 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని పేర్కొన్నారు. నవంబర్ 30వ తేదీన మహబూబ్ నగర్ లో జరగనున్న రైతుపండగ సందర్భంగా డబ్బులు జమ చేస్తామని ప్రకటన చేశారు.

రుణమాఫీకి రూ.18 వేల కోట్లు ఖర్చు చేశామని.. మిగతా రైతులకు కూడా అందజేస్తామని తెలిపారు. కుటుంబ నిర్ధారణ ప్రక్రియకు సమయం తీసుకోవటంతో పలువురు రైతులకు మాఫీ కాలేదని చెప్పారు. వ్యవసాయ శాఖాధికారులు గత 3 నెలలుగా రైతుల వివరాలు సేకరించారని… తప్పులను సరిచేశారని వివరించారు.వీరందరికీ ఈనెల 30వ తేదీన డబ్బులు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రజా పాలన ఉత్సవాలు - పాలమూరులో భారీ సభ:

డిసెంబర్ 1 నుంచి 9 వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో విజయోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

  • "ఈ నెల 30వ తేదీన మహబూబ్​నగర్‌లో రైతులకు అవగాహన కల్పించే రీతిలో రైతు సదస్సుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
  • డిసెంబర్ 4 వ తేదీన పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపాలి. ఆ వేదికగా గ్రూప్ 4 తో పాటు వివిధ రిక్రూట్‌మెంట్ల ద్వారా ఎంపికైన 9 వేల మందికి నియామక పత్రాలు అందించాలి.
  • డిసెంబర్ 1 వ తేదీ నుంచి శాఖల వారీగా నిర్దేశించిన మేరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఈ వారం రోజుల్లో జరిగేలా ప్రణాళికను రూపొందించాలి. తొలి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికతో పాటు భవిష్యత్తు ప్రణాళికను ప్రజల ముందు ఆవిష్కరించాలి.
  • డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలి.
  • ఈ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో సచివాలయ పరిసరాలు, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలి.
  • పరిసరాల్లో ఎగ్జిబిషన్ లాంటి వాతావరణం ఉండేలా వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలి. మూడు రోజుల పాటు తెలంగాణ సంస్కృతి, కళారూపాలు ఉట్టి పడే కార్యక్రమాలతో పాటు మ్యూజికల్ షోలు, ఎయిర్ షో, కన్నుల పండువలా ఉండే డ్రోన్ షోలను నిర్వహించాలి.
  • రాష్ట్ర మంతటా అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లోనూ ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు నిర్వహించాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలి.
  • డిసెంబర్ 9 న సచివాలయ ముఖద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలి. ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులను, వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారందరినీ ఆహ్వానించాలి.
  • ప్రతి నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున మహిళా శక్తి ప్రతినిధులను ఆహ్వానించి... లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలి.
  • డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్ నగరంలో జరిగే ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలి" అని రేవంత్ రెడ్డి సూచించారు.

Whats_app_banner

సంబంధిత కథనం