Celebrity Taxpayer: ఇండియాలో అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీ ఇతడే.. ఏకంగా రూ.92 కోట్లు.. రెండో స్థానంలో విజయ్ దళపతి
Celebrity Taxpayer: ఇండియాలో గతేడాది అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీ ఎవరో తెలుసా? ఏకంగా రూ.92 కోట్ల ట్యాక్స్ కట్టడం విశేషం. రెండో స్థానంలో అయితే సౌత్ స్టార్ దళపతి విజయ్ రూ.80 కోట్లతో ఉన్నాడు.
Celebrity Taxpayer: సెలబ్రిటీలు ప్రతి ఏటా వందల కోట్లు సంపాదించడం కామనే. ముఖ్యంగా క్రికెటర్లు, సినిమా స్టార్ల సంపాదన మన ఊహకందని రీతిలో ఉంటుంది. అలాగే వాళ్లు కట్టే ట్యాక్స్ కూడా అదే స్థాయిలో ఉంటూ వస్తోంది. ఇలా గతేడాది బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఏకంగా రూ.92 కోట్ల ట్యాక్స్ కట్టి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
అత్యధిక ట్యాక్స్ కట్టిన షారుక్
షారుక్ ఖాన్ కు 2023 ఓ మరుపు రాని ఏడాదిగా చెప్పొచ్చు. అతడు నటించిన పఠాన్, జవాన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.2600 కోట్లు వసూలు చేశాయి. ఏడాది చివర్లో డంకీతో మరో హిట్ కూడా అందుకున్నాడు. ఇలా హ్యాట్రిక్ విజయాలు సాధించిన షారుక్ సంపాదన కూడా భారీగానే ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీల జాబితాలో షారుక్ తొలి స్థానంలో ఉన్నాడు.
అతడు రూ.92 కోట్లు కేవలం ట్యాక్స్ రూపంలోనే కట్టాడంటే అతడు ఏ స్థాయిలో సంపాదించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అతని తర్వాత రెండో స్థానంలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ఉన్నాడు. అతడు గత ఆర్థిక సంవత్సరంలో రూ.80 కోట్లు ట్యాక్స్ రూపంలో చెల్లించాడు. ఈ ఇద్దరి తర్వాత సల్మాన్ ఖాన్ రూ.75 కోట్లు, అమితాబ్ బచ్చన్ రూ.71 కోట్లు, విరాట్ కోహ్లి రూ.66 కోట్లు చెల్లించారు. ఇక ఫిమేల్ సెలబ్రిటీల విషయానికి వస్తే రూ.20 కోట్లతో కరీనా కపూర్ టాప్ లో నిలుస్తోంది.
షారుక్ వర్సెస్ విజయ్
అటు నార్త్, ఇటు సౌత్ సెలబ్రిటీలు ట్యాక్స్ విషయంలోనూ గట్టిగానే పోటీ పడ్డారు. అయితే విజయ్ కంటే రూ.12 కోట్లు ఎక్కువ ట్యాక్స్ చెల్లించి షారుక్ టాప్ లో నిలిచాడు. గతేడాది మొదట్లోనే పఠాన్ సినిమాతో షారుక్ దూసుకెళ్లాడు. తర్వాత జవాన్ రూ.1150 కోట్లు, డంకీ రూ.400 కోట్లు వసూలు చేశాయి. అటు దళపతి విజయ్ కూడా లియో రూపంలో ఓ పెద్ద హిట్ అందుకున్నాడు.
తర్వాత ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ద్వారా కూడా బాగానే సంపాదించాడు. దీంతో అతడు కూడా భారీగానే ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో సెలబ్రిటీలు చెల్లించిన పన్ను ఆధారంగా ఈ లిస్ట్ తయారు చేయించినట్లు ఫార్చూన్ ఇండియా వెల్లడించింది.