Adilabad Winter: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా, కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు
Adilabad Winter: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసిరింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా, గడ్డ కట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్(యు)లో కనిష్ఠంగా 9.9 డిగ్రీలు నమోదయ్యాయి. జిల్లాలో చలి పంజా విసురుతోంది. రెండు, మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
Adilabad Winter: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. రాత్రి శీతల గాలులు వీస్తుండగా వేకువజామున పొగమంచు కమ్మేస్తోంది.దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఈ ప్రభావం మరింత అధికం. సాయంత్రం ఆరు దాటిందంటే జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో ఉపశమనం కోసం జనం చలిమంటలు కాగుతున్నారు. సాయంత్రం ఐదు గంటల తరువాత చలి తీవ్రత అధికమవుతోంది. ప్రజలు స్వెట్టర్లు, చలిమంటలతో చలికి విముక్తి పొందుతున్నారు.
జిల్లాలో గత రెండురోజులు గా బజార్ హత్నూర్ మండలం లో 10.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది, కొమురం భీం జిల్లా సిర్పూర్‌లో 8.3 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేలాలో 9.9 డిగ్రీలు, నిర్మల్ జిల్లా కుబీర్‌లో 10.9 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా ర్యాలీలో 11.2 డిగ్రీలు నమోదయ్యాయి.
ఉదయం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిన్నెధారిలో 12.1, కెరమెరి 12.6, ధనొర 12.6, ఆసిఫాబాద్ 12.9, తిర్యాణి లో 13.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, పగలు అనే తేడా లేకుండా చలి ప్రజలను బాధిస్తోంది. సింగిల్ డిజిట్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో చలితో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
చలి తీవ్రతతో ప్రజలు రోజువారీ పనుల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలిమంటలు సాధారణంగా కనిపిస్తున్నాయి. వృద్ధులు, పిల్లలు చలికి ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. జిల్లా వాసులు ఈ పరిస్థితులను తట్టుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో నారింజ పండ్ల వాహనం బోల్తా పడింది. తాజాగా, సీతగొంది సమీపంలోనూ ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. మరోవైపు, పొగమంచు కారణంగా శనగ, పత్తిపంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెట్టర్లు, చలిమంటలను ఆశ్రయిస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయాన్నే ఎక్కడ చూసినా చలిమంటలే దర్శనమిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి చలి తీవ్రత పెరిగిందని.. ఉదయం వాకింగ్ సమయం కూడా ఆలస్యంగానే ప్రారంభమవుతుందని పలువురు చెబుతున్నారు. ఓ వైపు చలి, మరోవైపు పొగమంచుతో ఉదయం పూట బయటకు రావాలంటేనే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అడవులు అత్యధికంగా ఉన్నాయి. దీంతో అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధికంగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం పూట పొగమంచు దట్టంగా అలుము కుంటోంది. దీంతో రహదారి సరిగ్గా కనబడక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు.
రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.