AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం గుడ్ న్యూస్.. సాయంత్రం 6 తర్వాత నో వర్క్..
AP Govt Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు చెప్పారు.ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలు ముగిసిన తర్వాత ఉద్యోగులు పనిచేయాల్సిన అవసరం లేదని, సాయంత్రం 6 తర్వాత కార్యాలయాల్లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించారు.
AP Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులపై పని ఒత్తిడి, వివిధ శాఖల ఉద్యోగులు కార్యాలయాల్లోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తుండటంతో ముఖ్యమంత్రి వారి సమస్యల్ని పరిష్కరించాలని నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల తర్వాత పనిచేయాల్సిన అవసరం లేదని ఇళ్లకు వెళ్లిపోవచ్చని ఉద్యోగులకు చంద్రబాబు సూచించారు.
పని ఒత్తిడిలో పడి కుటుంబాల్ని నిర్లక్ష్యం చేస్తుండటం, ఆరోగ్యం పాడు చేసుకుంటున్న ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త వినిపించారు. రాష్ట్రంలో ఉద్యోగులు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆఫీసు వదిలి ఇళ్లకు వెళ్లిపోవాలని చంద్రబాబు సలహా ఇచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు ఉద్యోగులకు ఈ సూచన చేశారు. ముఖ‌్యమంత్రి ప్రకటనను ఉద్యోగులు స్వాగతిస్తున్నారు.
రాష్ట్రంలో ఉద్యోగులంతా స్మార్ట్ వర్క్ చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఆఫీస్‌లో ఉండొద్దని వారికి సూచించారు. అలాగే తాను కూడా 6 గంటలకే సచివాలయం నుంచి వెళ్లిపోతానని తెలిపారు. రాత్రి పొద్దుపోయే వరకు శాఖల వారీగా సమీక్షలు చేయడం, ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల కోసం మిగిలిన ఉద్యోగులు కూడా సచివాలయంలో పడిగాపులు పడాల్సి వస్తుంది.
ఉన్నతాధికారులు, మంత్రులు స్థాయి ఉద్యోగులు వాహనాల్లో వెళ్లిపోయిన కిందిస్థాయి ఉద్యోగులు నివాసాలకు చేరుకోడానికి నానా పాట్లు పడాల్సి వస్తోంది. ఇక వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా ఈ ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని శాఖల్లో ఉదయం వస్తే రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇళ్లకు చేరుకోవాల్సి వస్తోంది.
దీంతో ఉద్యోగులు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని వారికి చంద్రబాబు సూచించారు. గతంలో ఎక్కువ గంటలు ఆఫీసుల్లో ఉండి పనిచేసే సంస్కృతి ఉండేదని చంద్రబాబు ఉద్యోగులకు గుర్తుచేశారు. ఇప్పుడు అమల్లోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇప్పుడు ఉద్యోగులకు ఎక్కువ సమయం ఆఫీసుల్లోనే ఉండి పనిచేయాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. కాబట్టి సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరూ ఆఫీసుల్లో ఉండొద్దనేది తన విధానంగా వివరింంచారు.
రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులతో పాటు ఏ శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు అయినా ఎక్కువ గంటలు కష్టపడాల్సిన పనిలేదన్నారు. అలాగే స్మార్ట్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని కూడా ఉద్యోగులకు సూచించారు. ముఖ్యమంత్రి ప్రకటనకు అనుగుణంగా ఉద్యోగుల పనివేళలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో పనివేళలను ఖచ్చితంగా అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.