Kurnool Crime : కర్నూలు జిల్లాలో ఘోరం.. అనుమానంతో భార్యను చంపిన భర్త.. పరారీలో నిందితుడు
Kurnool Crime : కర్నూలు జిల్లాలో హోరమైన ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్య గొంతు కోసి భర్త హత్య చేశాడు. భార్య శారద (36)ను భర్త రామానాయుడు కత్తితో గొంతు కోసి హత్య చేసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు జిల్ల పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం రాంపల్లి గ్రామంలో దారుణం జరిగింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన సమాచారం మేరకు.. రాంపల్లి గ్రామానికి చెందిన రామానాయుడికి రామలింగాయపల్లి గ్రామానికి చెందిన శారదకు 18 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రామానాయుడు, శారద మధ్య విభేదాలు తలెత్తడంతో నాలుగేళ్లుగా గ్రామంలో వేర్వేరుగా ఉంటున్నారు.
వేరే యువతితో పెళ్లి..
ఏడాది కిందట రామానాయుడు చక్రాళ్ల గ్రామానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో శారద భర్తపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. రామానాయుడు గ్రామంలోనే బట్టల దుకాణం నిర్వహిస్తుంటాడు. శారద కూడా అదే వ్యాపారం చేసుకుంటూ జీవనం కొసాగిస్తుంది.
ఈ నేపథ్యంలో భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త రామానాయుడు అనుమానం పెంచుకున్నాడు. మరోవైపు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు శారద పేరుతో రామానాయుడు పత్తికొండలో ఇల్లు కొన్నాడు. ఈ ఇల్లు కూడా తనకు చెందుతుందని ఇరువురు మధ్య తగాదాలు జరుగుతున్నాయి.
ఒంటరిగా ఉండగా..
పెద్ద కుమారుడు శివాజీ తల్లి శారద వద్దే ఉంటాడు. చిన్న కుమారుడు మాత్రం అమ్మమ్మ, తాతయ్యతో ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం సమయంలో శారద ఒంటరిగా ఇంట్లో ఉంది. ఆ సమయంలో రామానాయుడు శారద ఇంట్లోకి చొరబడి తలుపు వేశాడు. బయటకు అరుపులు వినపించకుండా టీవీ సౌండ్ పెంచి హత్య చేశాడు. అనంతరం అక్కడ నుంచి పారిపోయాడు. స్థానికులు వెళ్లే సరికి శారద రక్తపుమడులో పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్, తుగ్గలి ఎస్ఐ కృష్ణమూర్తి ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హత్యకు దారితీసిన కారణాలపై విచారణ చేస్తున్నారు. వివాహేతర సంబంధం, ఆస్తి తగాదాలనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు )