Fengal Cyclone: నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న తీవ్రవాయుగుండం, దక్షిణకోస్తా, రాయలసీమలకు భారీవర్షాలు
Fengal Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలోని నెల్లూరు, తిరుపతి నుంచి తమిళనాడు వరకు వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో తమిళనాడులో పరీక్షలు వాయిదా వేశారు. ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
Fengal Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతానికి ట్రింకోమలీకి 100 కిమీ, నాగపట్నానికి 320 కి.మీ, పుదుచ్చేరికి 410 కి.మీ మరియు చెన్నైకి 490 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండి ప్రకటించింది. బుధవారం రాత్రికి శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత, ఇది ఉత్తర-వాయువ్య దిశగా పయనించి శనివారం నవంబర్ 30వ తేదీ ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది.
వాయుగుండం ప్రభావంతో మూడు రోజులు (28-30) దక్షిణకోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-45 కి.మీ గరిష్టంగా 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని,మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తీవ్ర వాయుగుండం తుఫానుగా మారనున్న నేపథ్యంలో పలు ఆ జిల్లాలలో భారీ వర్షాలు కురస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. రాయలసీమ, దక్షిణకోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలోని అన్ని పోర్టులలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తాయన్నారు. 48 గంటలలో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం నుంచి ఈనెల 30వరకు ఉత్తరాంద్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
దీని ప్రభావం దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్య్సకారులను చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు కోరారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
తమిళనాడులో సెలవులు..
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విల్లుపురం, తిరువళ్లూరు, కడలూరు, తంజావూరు, తిరువారూర్, నాగపట్టణం, మైలాడుతురై, రామనాథపురం, తిరుచ్చి సహా తొమ్మిది జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు అధికారులు బుధవారం సెలవు ప్రకటించారు. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, అరియలూరు, శివగంగై, పుదుకోట్టైలో కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
మద్రాస్ యూనివర్సిటీ, కారైకుడి అళగప్ప యూనివర్సిటీ, భారతీదాసన్ యూనివర్సిటీ, డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తమ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశాయి. సవరించిన తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా నేడు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
కడలూరు, మైలాడుతురై, కరైకల్ ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, అరియలూరు, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, పుదుకోట్టై జిల్లాలతో పాటు పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
రైతులకు ముందస్తు హెచ్చరికలు…
భారీ వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు/బాదులతో సపోర్ట్ అందించాలని కోరారు.
రానున్న నాలుగు రోజులు వాతావరణం క్రింద విధంగా ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వివరించారు.
నవంబర్ 28, గురువారం:
• నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు మరియు కృష్ణా జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 29, శుక్రవారం :
• ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• కాకినాడ, అనకాపల్లి మరియు విశాఖపట్నం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు మరియు బాపట్ల జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 30,శనివారం :
• నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
డిసెంబర్ 1, ఆదివారం :
• శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, మరియు ఏలూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.