Revanth Reddy : హాస్టళ్లలో వరుస ఘటనలు.. సీఎం రేవంత్ సీరియస్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు-cm revanth reddy is angry over frequent incidents in hostels in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy : హాస్టళ్లలో వరుస ఘటనలు.. సీఎం రేవంత్ సీరియస్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

Revanth Reddy : హాస్టళ్లలో వరుస ఘటనలు.. సీఎం రేవంత్ సీరియస్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

Basani Shiva Kumar HT Telugu
Nov 28, 2024 11:43 AM IST

Revanth Reddy : తెలంగాణలోని ప్రభుత్వ వసతి గృహాల్లో ఇటీవల వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ ఘటనలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి (@TelanganaCMO)

రాష్ట్రంలోని ప్రభుత్వ వ‌స‌తి గృహాల్లో త‌ర‌చూ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. పాఠ‌శాల‌లు, గురుకులాల‌ను త‌ర‌చూ త‌నిఖీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. విద్యార్థుల‌కు ప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో పౌష్టికాహారం అంద‌జేయాలని స్పష్టం చేశారు. ఫుడ్ పాయిజన్, ఇతర ఘటనలకు బాధ్యులైన వారిపై వేటు వేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

హాస్టళ్లలో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన నివేదిక‌ల‌ను సమ‌ర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప‌లుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొర‌పాట్లు జరగడంపై సీఎం సీరియస్ అయ్యారు. విద్యార్థుల‌కు ఆహారం అందించే విష‌యంలో ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వని వార్నింగ్ ఇచ్చారు. లేని వార్త‌లను ప్ర‌చారం చేస్తూ.. విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్నార‌ని.. వారిపైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

విద్యార్థుల‌కు ఆహారం అందించే విష‌యంలో ఎవ‌రైనా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు రుజువైతే.. వారిని ఉద్యోగాల నుంచి తొల‌గించేందుకు వెనుకాడ‌మ‌ని సీఎం రేవంత్ స్ప‌ష్టం చేశారు. విద్యార్థుల‌కు మంచి విద్య అందించాల‌నే ఉద్దేశంతో వేల సంఖ్య‌లో ఉపాధ్యాయుల నియామ‌కాలు చేప‌ట్ట‌ామని.. వారికి పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు.

విద్యార్థుల విష‌యంలో తాము సానుకూల నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ప్ప‌టికీ.. కొంద‌రు ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ట‌పాలు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి శ‌క్తుల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని, బాధ్యులైన వారిని చ‌ట్ట‌ప్ర‌కారం శిక్షిస్తామ‌ని హెచ్చ‌రించారు. వ‌స‌తిగృహాల్లో ఆహారం విష‌యంలో కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌కంగా పుకార్లు సృష్టిస్తున్నారని ఆసహనం వ్యక్తం చేశారు.

అక్టోబర్‌ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో శైలజ (16) అనే విద్యార్థిని భోజనం చేసింది. అనంతరం అస్వస్థతకు గురైంది. 21 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శైలజ చనిపోయింది. కళ్ల ముందే కన్న కుమార్తె చనిపోవడంతో ఆ తల్లి పెట్టిన రోదన ఆకాశాన్నంటింది. విద్యార్థిని మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అంటూ విపక్ష నేతలు విమర్శించారు. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

కేటీఆర్ విమర్శలు..

వాంకిడి గురుకుల విద్యార్థిని మృతికి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వమే కారణమని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద చదువులు చదివేందుకు గురుకులాల్లో చేరిస్తే పేద గిరిజన బిడ్డను బలి తీసుకున్నారని నిప్పులు చెరిగారు. విద్యాశాఖ మంత్రి లేక విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదని, ముఖ్యమంత్రికి పేదల పిల్లల బాధలు పట్టవంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

Whats_app_banner