Roti Kapda Romance Review: రోటి కప్‌డా రొమాన్స్ రివ్యూ - యూత్‌ఫుల్ రొమాంటిక్ మూవీ ఎలా ఉందంటే?
Roti Kapda Romance Review: హర్ష, సందీప్ సరోజ్, సుప్రజ్ రంగా, తరుణ్ ప్రధాన పాత్రల్లో న టించిన రోటి కప్‌డా రొమాన్స్ మూవీ గురువారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ మూవీ ఎలా ఉందంటే?
Roti Kapda Romance Review: యూత్‌ఫుల్ లవ్ డ్రామాగా రూపొందిన తెలుగు మూవీ రోటి కప్‌డా రొమాన్స్ గురువారం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో హర్ష, సందీప్ సరోజ్, సుప్రజ్ రంగా, తరుణ్, నువేక్ష, మేఘలేఖ హీరోహీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహంచాడు. బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ నిర్మించారు. యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
నలుగురు స్నేహితుల కథ...
హర్ష (హర్ష నర్రా), రాహుల్ ( సందీప్ సరోజ్), విక్కీ (సుప్రజ్ రంగా), సూర్య (తరుణ్) చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్. ఒకే రూమ్‌లో ఉంటుంటారు. హర్ష, రాహుల్, సూర్య జాబ్ చేస్తుంటే విక్కీ ఏ పనిపాట లేకుండా స్నేహితుల డబ్బుతో జల్సాలు చేస్తుంటాడు. నలుగురు ఫ్రెండ్స్ కలిసి గోవా ట్రిప్ వెళతారు. ఈ ట్రిప్‌లోనే వారి జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. ఈ స్నేహితుల జీవితాల్లో నలుగురు అమ్మాయిలు ఉన్నారనే నిజం బయటపడుతుంది.
అభిమానిగా సూర్య జీవితంలోకి దివ్య (నువేక్ష) వస్తుంది. జాబ్ విషయంలో శ్వేతతో (మేఘలేఖ) విక్కీకి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది.బాయ్ ఫ్రెండ్‌గా నాటకం ఆడమని హర్షను సోనియా (ఖుష్బూ చౌదరి) కోరుతుంది. రాహుల్ తన ఆఫీస్‌లోనే పనిచేసే ప్రియను (సోనియా ఠాకూర్) ప్రేమిస్తాడు.
పెళ్లి టాపిక్ ఎత్తేసరికి భయపడిపోతాడు. తమ లైఫ్‌లోకి అమ్మాయిలు వచ్చిన అమ్మాయిల కారణంగా ఆ నలుగురి స్నేహితుల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? ప్రేమించిన అమ్మాయిలకు వారు ఎందుకు దూరమయ్యారు? బ్రేకప్ తర్వాత వారి లైఫ్ ఎలా సాగింది? గోవా ట్రిప్‌లో ఏం జరిగింది? గోవా టికెట్స్‌ను విక్కీ ఎందుకు పంపాడు? అన్నదే రోటి కప్‌డా రొమాన్స్ మూవీ కథ.
ఎవర్‌గ్రీన్ కాన్సెప్ట్...
స్నేహం, ప్రేమ అన్నది టాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్ కాన్సెప్ట్. ఈ పాయింట్‌తో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై ఎన్నో సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. రోటి కప్‌డా రొమాన్స్ కూడా ఆ కోవకు చెందిన మూవీనే.
లవ్, ఫ్రెండ్‌షిప్ విషయంలో నేటితరం ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి ? తొందరపాటుతో సరైన మెచ్యూరిటీ లేకుండా తీసుకునే నిర్ణయాల వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? రిలేషన్‌షిప్స్‌లో ఉండే అభిప్రాయభేదాలు, వాటి వల్ల వచ్చే కన్ఫ్యూజన్స్‌ను నాలుగు కథలతో ఈ మూవీలో చూపించారు దర్శకుడు విక్రమ్ రెడ్డి.
ఎంటర్‌టైన్‌మెంట్...
యూత్‌కు సీరియస్‌గా క్లాస్ పీకుతున్నట్లుగా కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్‌టైన్‌మెంట్ హాయిగా నవ్విస్తూ సినిమా సాగుతుంది. చివరలో చిన్న షుగర్ కోటెడ్‌లో మెసేజ్‌ను టచ్ చేశారు. నిజంగానే ఓ నలుగురు స్నేహితులు కలిసినప్పుడు ఎలాంటి సరదాలు ఉంటాయో అంతే నాచురల్‌గా కథను రాసుకున్నాడు డైరెక్టర్. యూత్‌కు రిలేజ్ అయ్యేలా జాగ్రత్తపడ్డారు.
సెకండాఫ్ బ్రేకప్‌లు...
సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీస్‌ను చూపించారు....సెకండాఫ్ బ్రేకప్ ఎలా పడ్డాయన్నది ఆవిష్కరించారు. రొమాన్స్, సస్పెన్స్...ఎంటర్‌టైన్‌మెంట్...ఒక్కోకథలో ఒక్కో ఎలిమెంట్ జోడించి చెప్పిన తీరు బాగుంది.
తెలిసిన కథలే కానీ...
విక్కీ శ్వేత కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ హిలేరియస్‌గా నవ్విస్తాయి. హర్ష సోనియా లవ్‌స్టోరీలో రొమాన్స్ పాళ్లు కాస్త ఎక్కువే దట్టించారు. బ్రేకప్ విషయంలో అమ్మాయిల ఆలోచన ఎలా ఉంటుందన్నది సూర్య, దివ్య ట్రాక్‌లో ఆవిష్కరించారు. రాహుల్, ప్రియా సీన్స్‌ను కొంత దర్శకుడు తడబడిపోయాడు.
అందరికి తెలిసిన సింపుల్ కథలనే ఎక్కడ బోర్ కొట్టకుండా కామెడీతో చివరి వరకు నడిపించడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఎంటర్‌టైన్‌మెంట్ స్థాయిలో ఎమోషనల్ సీన్స్‌ను దర్శకుడు రాసుకోలేకపోయిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ బ్రేకప్ స్టోరీస్ రొటీన్ ఫీలింగ్‌ను కలగిస్తాయి.
కామెడీ టైమింగ్‌తో...
నలుగురు కుర్రాళ్లుగా సందీప్ సరోజ్, హర్ష నర్రా, తరుణ్, సుప్రజ్ రంగా తమ పాత్రలకు న్యాయం చేశారు. కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. వీరిలో విక్కీ పాత్ర చేసిన సుప్రజ్ రంగా ఎక్కువగా గుర్తుండిపోతాడు. మోడ్రన్ గర్ల్‌గా నువేక్ష బోల్డ్ రోల్‌లో కనిపించింది. నెగెటివ్ షేడ్స్‌తో సాగే పాత్రలో మేఘలేఖ నటన బాగుంది. ఖుష్బూ చౌదరి, సోనియా ఠాకూర్ కూడా ఓకే అనిపిస్తారు.
టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్...
రోటి కప్‌డా రొమాన్స్ టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్ మూవీ. యూత్ ఆడియెన్స్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది.
రేటింగ్:2.75/5