TG Ayyappa Devotees : అయ్యప్ప మాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్‌కు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు!
TG Ayyappa Devotees : ఆర్టీసీ ఉద్యోగులు వివాదాల్లో చిక్కుకున్నారు. అయ్యప్ప మాల ధరించిన డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళనలు చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపో అధికారులు చిక్కుల్లో చిక్కుకున్నారు. తమ విధుల్లో భాగంగా.. అయ్యప్ప మాల ధరించిన డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. ఈ ఇష్యూపై ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది. ఈ ఘటనపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాలలో ఉన్నవారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
డ్రైవర్ నాగరాజు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. నాగరాజు ఇటీవల అయ్యప్ప మాల ధరించారు. రోజు మాదిరిగానే నాగరాజు డ్యూటీకి వెళ్లారు. మాలలో ఉన్న నాగరాజుకు కూడా ఆర్టీసీ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. తాను అయ్యప్ప మాల ధరించానని.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయొవద్దని డ్రైవర్ నాగరాజు విజ్ఞప్తి చేశారని, ఎంత చెప్పినా వినకుండా ఆర్టీసీ అధికారులు టెస్ట్ చేశారని తెలుస్తోంది.
అయ్యప్ప మాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడంపై.. అయ్యప్ప స్వామి భక్తి మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. అయ్యప్ప స్వామి భక్తి మండలి ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేశారు. అయితే.. ఇష్యూ సీరియస్ కావడంతో.. ఆర్టీసీ అధికారులు దిగొచ్చారు. డిపో మేనేజర్ చివరికి క్షమాపణలు చెప్పారు. కేవలం తొర్రూరులోనే కాదు.. రాష్ట్రంలోని పలు డిపోల ఎదుట అయ్యప్ప భక్తులు ఆందోళనలు చేశారు.
41 రోజులపాటు..
అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు. ఈ దీక్షను 41 రోజుల పాటు కొనసాగిస్తారు. అయ్యప్ప దీక్షలో ఉండే వారు రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం, పగడాలు, తామర పూసల మాలల ధరిస్తారు. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తాయి. శబరిమలలోని 18 మెట్లను ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడం ఈ దీక్ష ముగుస్తుంది. ఈ కాలంలో ఎలాంటి హంగు, ఆర్భాటాలు, లేకుండా సామాన్య జీవన గడపడం అలవాటు అవుతుంది.
కార్తీక మాసంలో..
హిందూ ఆచారాల ప్రకారం, సాధారణంగా కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి మధ్యలో 41 రోజుల పాటు అయ్యప్ప మాలను ధరిస్తారు. అయితే తల్లిదండ్రులలో ఎవరు మరణించినా వారు కనీసం సంవత్సరం పాటు మాలను వేసుకోకూడదు. అలాగే భార్య మరణించిన తర్వాత ఆరు నెలల వరకు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలి.
నల్లటి దుస్తులతో..
అయ్యప్ప దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను ధరిస్తారు. ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఉండదని చాలా మంది విశ్వసిస్తారు. చలికాలంలోనే అయ్యప్పమాలను ధరిస్తారు. ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి.