Ayyappa Deeksha Days: ఈ సారి అయ్యప్ప దీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయి.. మకర జ్యోతి దర్శనం ఎప్పుడు?
అయ్యప్ప దీక్ష: కార్తీక మాసంలో చాలా మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. కొందరు మండలం పాటు అయ్యప్ప మాల వేసుకుని కఠినమైన దీక్షలు చేస్తుంటారు. ఈ ఏడాది అయ్యప్ప దీక్ష ఎప్పుడు మొదలవుతుంది, అది ఎంతకాలం ఉంటుంది, మాలధారి నియమాలు ఏమిటో తెలుసుకుందాం.
పవిత్ర కార్తీకమాసం ప్రారంభమైందంటే శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. చాలా మంది భక్తులు మాలధారణ చేపట్టి మండలం పాటు కఠిన దీక్షలో పాల్గొంటారు. మరికొందరు అర్థమండలం పాటు మాలధరిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ప్రాంతాల్లో కార్తీక మాసం మొదలవగానే అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభమవుతాయి. ఈ మాల ధారణ చేసిన వారు మండలం పాటు నియమ నిష్టలతో అత్యంత కఠినమైన రోజులను గడపాలని, మనస్సును, శరీరాన్ని పూర్తిగా దైవ భక్తికే అంకితం చేయాలని చెబుతుంటారు. ఈ ఏడాది అయ్యప్ప దీక్ష ఎప్పుడు మొదలవుతుంది, అది ఎంతకాలం ఉంటుంది, శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఎప్పుడు అనే వివరాలను తెలుసుకుందాం.
కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష చేపట్టే వారిలో ఎక్కువ మంది మండల కాలం అంటే 41రోజుల పాటు దీక్ష చేస్తారు. మరికొందరు అర్థమండల దీక్ష అంటే 21రోజుల పాటు దీక్షలో పాల్గొంటారు. దీక్షలో ఉన్నంత కాలం మాల ధరించిన వ్యక్తిని స్వామిగా భావిస్తారు. అంటే దేవుడితో సమానమని అర్థం. అందుకే ఈ 41 రోజులూ వారు అన్ని ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటారు. ఉదయం, సాయంత్రం పూట చల్లటి నీటి స్నానాలు చేయాలి. జుట్టు, గోర్లు కత్తిరించడం, రంగుల రంగుల బట్టలం వేయడం చేయరాదు. మాలధారణ సమయంలో కేవలం నల్లటి దుస్తులను మాత్రమే ధరించాలి. కాలికి చెప్పులు కూడా వేసుకోకూడదు. సరళమైన ఆహారం మాత్రమే తీసుకుంటారు. మాంసాహారం తినడం, శృంగారంలో పాల్గొనడం, ధూమపానం చేయడం, మద్యం సేవించడం వంటి వాటిని మలధారణ సమయంలో చేయడం పెద్ద పాపంగా భావిస్తారు. అంత్యక్రియలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అంతే కాదు తిట్టడం, గొడవపడటం, ఇతరులను అవమానించడం ఈ సమయంలో వారు చేయకూడదు.
ఈ సారి మండల దీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయి:
ఈ సారి మండల దీక్షా పూజలు నవంబర్ 15 నుంచి ప్రారంభమవుతాయి. నవంబర్ 16 నుంచి జనవరి 14 వరకు కఠినమైన నియమాలను పాటిస్తారు. అయితే ఇప్పటికే కొందరు శబరిమలకు వెళ్లి దీక్ష తీసుకోగా, మరికొందరు సమీపంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గురు స్వామి సన్నిధిలో మాలలు ధరిస్తున్నారు.
మకర జ్యోతి దర్శనం ఎప్పుడు..?
అయ్యప్ప మండల దీక్షలో మకర జ్యోతికి విశిష్ట ప్రాముఖ్యత ఉంటుంది. మండలం పాటు కఠిన దీక్షను ఆచరించిన వారికోసం స్వయంగా ఆ అయ్యప్ప స్వామే జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తులు నమ్ముతారు. శబరిమల అయ్యప్ప గుడిలో 18 మెట్లు ఎక్కడమే మోక్షానికి మార్గమని వారు భావిస్తారు. భక్తులు కఠినమైన మాలధారణ సమయం ముగిసిన తర్వాత ఇరుముడి కట్టుకుని శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామిని, మకరజ్యోతి దర్శించుకోవడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది జనవరి 15న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఆరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు భక్తులకు జ్యోతి దర్శనం జరగనుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.