AP Inter Exams Fee: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. లేట్‌ ఫీతో డిసెంబర్‌ 5వరకు అవకాశం, గడువు పొడిగింపు లేదు…-alert for ap inter students opportunity till december 5 with late fee ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Inter Exams Fee: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. లేట్‌ ఫీతో డిసెంబర్‌ 5వరకు అవకాశం, గడువు పొడిగింపు లేదు…

AP Inter Exams Fee: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. లేట్‌ ఫీతో డిసెంబర్‌ 5వరకు అవకాశం, గడువు పొడిగింపు లేదు…

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 28, 2024 01:00 PM IST

AP Inter Exams Fee: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ రెగ్యులర్‌, ప్రైవేట్‌ విద్యార్థులకు ఫీజు చెల్లించడానికి గడువు ముగిసింది.ఆలస్య రుసుముతో డిసెంబర్ 5 వరకు ఫీజు చెల్లించవచ్చని, ఫీజు చెల్లించడానికి గడువు పొడిగింపు ఉండదని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వివరించారు.

ఏపీ ఇంటర్ పరీక్ష ఫీజులు
ఏపీ ఇంటర్ పరీక్ష ఫీజులు

AP Inter Exams Fee: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజుల చెల్లింపు షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు గత నెలలో విడుదల చేసింది. నవంబర్‌ 21తో ఫీజుల చెల్లింపు గడువు ముగిసింది. ఇంటర్‌ మొదటి, ద్వితియ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులతో పాటు సప్లమెంటరీ విద్యార్థులు ఫీజులు చెల్లింపు తేదీలను ఖరారు చేశారు. హాజరు మినహాయింపు పొందిన అభ్యర్థులు కూడా వార్షిక పరీక్ష ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. వెయ్యి రుపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 5వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించడానికి అనుమతిస్తారు. ఈ గడువు పొడిగించరని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు.

ఇంటర్ మొదటి, ద్వితియ సంవత్సరం వార్షిక ఫీజులతో పాటు గతంలో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు, ప్రైవేట్‌గా పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు వార్షిక పరీక్ష ఫీజులు చెల్లించాలని ఇంటర్ బోర్డు సూచించింది.

ఇంటర్మీడియట్ 2025 పరీక్ష ఫీజుల షెడ్యూల్ ఇలా...

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ 2025 మార్చి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఎలాంటి జరిమానా లేకుండా అక్టోబర్‌ 21 నుంచి నవంబర్ 11 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ.1000 జరిమానాతో నవంబర్ 12 నుంచి 20వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజుల చెల్లింపుకు ఎలాంటి గడువు పొడిగింపు ఉండదని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

పరీక్ష ఫీజు ఇలా...

ఇంటర్‌ మొదటి, ద్వితియ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు గ్రూపుతో సంబంధం లేకుండా విద్యార్థులు రూ.600 ఫీజు చెల్లించాలి.

ఇంటర్ జనరల్, ఒకేషనల్‌ కోర్సులు చదువుతున్న మొదటి, ద్వితియ సంవత్సరం విద్యార్థులు రూ.275 ప్రాక్టికల్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్‌ జనరల్‌, ఒకేషనల్‌ కోర్సుల్లో బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులు చదువుతున్న అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.165 చెల్లించాలి. బైపీసీ కోర్సులు చదివే విద్యార్థులు మ్యాథ్స్‌ బ్రిడ్సి కోర్సు కోసం కూడా ఫీజు చెల్లించాలి.

రెండో సంవత్సరం ఒకేషనల్‌ బ్రిడ్జి కోర్సు ఫీజుగా రూ.165 చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్‌ మొదటి, ద్వితియ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న జనరల్, ఒకేషనల్ విద్యార్థులు సబ్జెక్టులతో సంబంధం లేకుండా జనరల్, ఒకేషనల్‌ కోర్సులకు రూ.1200 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

సబ్జెక్టుల సంఖ్యతో సంబంధం లేకుండా మొదటి, ద్వితియ సంవత్సరం జనరల్, ఒకేషనల్‌ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రూ.550 ఫీజు చెల్లించాలి.

రెండు సంవత్సరాల జనరల్, ఒకేషనల్‌ బ్రిడ్జి కోర్సు సబ్జెక్టు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రూ.330 చెల్లించాలి.

ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, మార్కుల్లో పురోగతి కోసం మొదటి, ద్వితియ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార‌్థులు ఆర్ట్స్‌ గ్రూపులైతే రూ.1350, సైన్స్‌ గ్రూపులైతే రూ.1600 ఫీజు చెల్లించాలి.

జూనియర్‌ కాలేజీలు పరీక్ష ఫీజులను ఐడిబిఐ బ్యాంకు రింగ్‌ రోడ్డు బ్రాంచి విజయవాడ, ఎస్‌బిఐ మాచవరం బ్రాంచిలో చెల్లుబాటు అయ్యేలా తమ కాలేజీ ఖాతాల నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులను నామినల్ రోల్స్‌ వారీగా చెల్లించాల్సి ఉంటుంది. సంబంధి బ్యాంకుల్లో ఖాతాలు లేని వారు ఫీజులను చెల్లించేందుకు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా చలాన్ అందుబాటులో ఉంచారు. ఫీజులను https://biev2.apcfss.in/ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

ప్రైవేట్ విద్యార్థులకు ఫీజు గడువు..

ఇంటర్మీడియట్ పరీక్షలకు ప్రైవేట్‌గా హాజరయ్యే విద్యార్థులు రూ.1500 అటెండెన్స్‌మినహాయింపు కోసం చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 15లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 30లోగా రూ.500 ఆలస్య రుసుముతో చెల్లించవచ్చు.

పదో తరగతి తర్వాత ఏడాది ఖాళీగా ఉన్న విద్యార్థులు ప్రైవేట్‌గా మొదటి సంవత్సరం పరీక్షలకు, రెండేళ్లు అంతకు మించి గ్యాప్‌ ఉన్న వారు ఒకేసారి రెండేళ్ల ఇంటర్ పరీక్షలకు హాజరు కావొచ్చు. ఇంటర్‌ బైపీసీలో పాసైన విద్యార్థులు కూడా మ్యాథమెటిక్స్‌ అదనపు సబ్జెక్టుగా పరీక్షలకు హాజరు కావొచ్చు.

ఇంటర్ పరీక్షలకు గతంలో హాజరై ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు ఆప్షనల్ సబ్జెక్టులను మార్చుకోవడానికి, కాలేజీలను మార్చుకోడానికి అనుమతిస్తారు.

ఇంటర్ అటెండెన్స్ ఫీజు రాయితీని https://biev2.apcfss.in/ ద్వారా ఆన్లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. హాజరు మినహాయింపు కోరే విద్యార్ధులు పదో తరగతి మార్కుల జాబితా, టీసీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్‌లో మాత్రమే ఫీజులు చెల్లించాలి. పోస్టులో పంపే దరఖాస్తులు స్వీకరించరు. పరీక్ష ఫీజుల చెల్లింపు గడువు ముగియడంతో రూ.1000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 5వరకు మాత్రమే ఫీజులు చెల్లిండచానికి అనుమతిస్తారు.

Whats_app_banner