SA vs SL 1st Test: 42 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక.. 120 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన సౌతాఫ్రికా బౌలర్-south africa vs sri lanka 1st test marco jansen 7 wickets sri lanka all out for just 42 runs in the first innings ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sa Vs Sl 1st Test: 42 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక.. 120 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన సౌతాఫ్రికా బౌలర్

SA vs SL 1st Test: 42 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక.. 120 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన సౌతాఫ్రికా బౌలర్

Hari Prasad S HT Telugu
Nov 28, 2024 06:14 PM IST

SA vs SL 1st Test: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక కేవలం 42 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్ మార్కో యాన్సెన్ దెబ్బకు లంక టీమ్ లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు.

42 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక.. 120 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన సౌతాఫ్రికా బౌలర్
42 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక.. 120 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన సౌతాఫ్రికా బౌలర్ (AFP)

SA vs SL 1st Test: సౌతాఫ్రికా బౌలర్ మార్కో యాన్సెన్ 120 ఏళ్ల టెస్టు రికార్డు రిపీట్ చేసిన వేళ.. శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. డర్బన్ లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 42 పరుగులకే కుప్పకూలి.. ఓ టెస్ట్ ఇన్నింగ్స్ లో తమ అత్యల్ప స్కోరు నమోదు చేసింది. అటు యాన్సెన్.. ఏడు ఓవర్లలోపే ఏడు వికెట్లు తీసి సరికొత్త రికార్డును తన పేరిట రాసుకున్నాడు.

శ్రీలంక చేతులెత్తేసింది

సౌతాఫ్రికా, శ్రీలంక మధ్య డర్బన్ లో జరుగుతున్న తొలి టెస్టులో బౌలర్లు పండగ చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా కేవలం 191 పరుగులకే ఆలౌటైంది. అయితే తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన శ్రీలంక.. మరీ దారుణంగా 42 పరుగులకే కుప్పకూలింది.

టెస్ట్ క్రికెట్ ఓ ఇన్నింగ్స్ లో శ్రీలంకకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. గతంలో 1994లో పాకిస్థాన్ పై క్యాండీలో 71 పరుగులకు ఆలౌటైంది. ఆ రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. సౌతాఫ్రికాపై ఓ టీమ్ అత్యల్ప టెస్టు స్కోరు కూడా ఇదే. 2013లో న్యూజిలాండ్ 45 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇప్పుడు శ్రీలంక 42కే చాప చుట్టేసింది.

120 ఏళ్ల రికార్డు బ్రేక్

శ్రీలంక బ్యాటర్ల పని పట్టాడు సౌతాఫ్రికా లెఫ్టామ్ పేస్ బౌలర్ మార్కో యాన్సెన్. అతడు కేవలం 6.5 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీయడం విశేషం. చివరిసారి 1904లో ఓ బౌలర్ ఇలా ఏడు ఓవర్లలోపే ఏడు వికెట్లు తీశాడు. దీంతో 120 ఏళ్ల కిందటి టెస్టు రికార్డును యాన్సెన్ రిపీట్ చేశాడు. అతని దెబ్బకు శ్రీలంక బ్యాటర్లలో ఐదుగురు డకౌటయ్యారు.

కమిందు మెండిస్ చేసిన 13 పరుగులే అత్యధిక స్కోరు. చివర్లో లాహిరు కుమార 10 పరుగులతో రెండంకెల స్కోరు అందుకున్నాడు. మిగతా ఎవరూ సింగిల్ డిజిట్ దాటలేదు. దినేష్ చండీమాల్, కుశల్ మెండిస్, ప్రభాత్ జయసూర్య, విశ్వ ఫెర్నాండో, అసిత ఫెర్నాండో డకౌటయ్యారు. శ్రీలంక కేవలం 13.5 ఓవర్లలోనే ఆలౌటైందంటే యాన్సెన్ జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Whats_app_banner