IND vs SA 4th T20: తిలక్ వర్మ, సంజూ శాంసన్ సెంచరీల మోత - నాలుగో టీ20లో సౌతాఫ్రికా ఓటమి - టీ20 సిరీస్ టీమిండియాదే!
IND vs SA 4th T20: నాలుగో టీ20లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన టీమిండియా 3-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్నది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 283 పరుగులు చేయగా...సౌతాఫ్రికా 148 పరుగులకే ఆలౌటైంది. నాలుగో టీ20లో సంజూ శాంసన్, తిలక్ వర్మ సెంచరీలతో దంచికొట్టారు.
IND vs SA 4th T20: నాలుగో టీ20లో సౌతాఫ్రికాను టీమిండియా చిత్తుగా ఓడించింది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ సెంచరీలతో దంచికొట్టడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 283 పరుగులు చేసి రికార్డులు సృష్టించింది. భారీ టార్గెట్‌ను ఛేదించడంలో చేతులెత్తేసిన సౌతాఫ్రికా 148 పరుగులకే ఆలౌటైంది. 135 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై ఘన విజయాన్ని సాధించిన టీమిండియా 3-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్నది.
10 పరుగులకే మూడు వికెట్లు...
284 పరుగులు భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన సౌతాఫ్రికాకు ఆరంభంలోనే అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్య గట్టి షాకిచ్చారు. వీరిద్దరి దెబ్బకు 10 పరుగులకే సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత స్టబ్స్ (29 బాల్స్‌లో మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో 43 పరుగులు) టీమిండియా బౌలర్లను ప్రతిఘటిస్తూ ఒంటరిపోరాటం చేశాడు. డేవిడ్ మిల్లర్ (36 రన్స్) సహకారంతో స్టబ్స్ సౌతాఫ్రికాను గట్టెక్కించే ప్రయత్నం చేశాడు.
జట్టు స్కోరు 96 పరుగులు వద్ద స్టబ్స్, మిల్లర్...ఇద్దరు ఔట్ కావడంతో సౌతాఫ్రికా ఓటమి ఖాయమైంది. జాన్సన్ (12 బాల్స్‌లో 29 రన్స్ మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు) చివరలో బ్యాట్ ఝులిపించడంలో సౌతాఫ్రికా ఈ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. 18.2 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.
అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు...
టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీసుకోగా...వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లకు తలో రెండు వికెట్లు తీసుకున్నారు. పాండ్య, రమణ్‌దీప్‌సింగ్, రవి బిష్ణోయ్‌లకు తలో వికెట్ దక్కింది.
సెంచరీల మోత...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇరవై ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే నష్టపోయి 283 పరుగులు చేసింది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ సెంచరీలతో సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఫోర్లు, సిక్సర్లతో బెంబేలెత్తించారు. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 41 బంతుల్లోనే సెంచరీ సాధించగా, సంజూ శాంసన్ 51 బాల్స్‌లో సెంచరీ చేశాడు.
23 సిక్సర్లు...
మొత్తంగా ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 47 బాల్స్‌లో తొమ్మిది ఫోర్లు పది సిక్సర్లతో 120 పరుగులు చేయగా...సంజూ శాంసన్ 56 బాల్స్‌లో ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో 109 పరుగులు చేశారు. వీరిద్దరు నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరు కలిసి 23 సిక్సర్లు కొట్టారు. టీ20 క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో టీమిండియా కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే కావడం గమనార్హం.
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ తిలక్ వర్మ...
సంజూ శాంసన్, తిలక్ వర్మ జోడిని విడదీసేందుకు సౌతాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్ చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. పోటీపడి సౌతాఫ్రికా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఈ సిరీస్‌లో రెండో టీ20లో మాత్రమే సౌతాఫ్రికా విజయం సాధించగా...మిగిలిన మూడు మ్యాచుల్లో టీమిండియా గెలుపును సొంతం చేసుకున్నది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రెండు అవార్డులు తిలక్ వర్మకే దక్కాయి.