Rishabh Pant: రిషబ్ పంత్‌తో ఐపీఎల్ 2025 వేలానికి ముందు గొడవని బయటపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ కో-ఓనర్.. ఇంత జరిగిందా?
Rishabh Pant IPL Price: రిషబ్ పంత్‌ను వేలానికి వదిలేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆ తర్వాత మళ్లీ అతని కోసం వేలంలో పోటీపడింది. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పంత్ ధర ఆకాశాన్నంటింది. ఆర్టీఎం కార్డు వాడినా ప్రయోజనం లేకపోయింది.
ఐపీఎల్ 2025 వేలానికి రిషబ్ పంత్‌ను వదిలేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. వేలానికి వచ్చిన ఈ భారత వికెట్ కీపర్ కోసం ఫ్రాంఛైజీలు గట్టిగా పోటీపడ్డాయి. దాంతో అతని ధర ఆకాశాన్నంటగా..చివరికి 17 ఏళ్ల ఐపీఎల్ వేలం చరిత్ర రికార్డులను బద్ధలు కొడుతూ రిషబ్ పంత్ రూ.27 కోట్లకి అమ్ముడుపోయాడు.
గొడవపై పెదవి విప్పిన ఢిల్లీ కో-ఓనర్
అసలు రిషబ్ పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ను ఎందుకు వీడాడో అనేది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అయితే.. ఎట్టకేలకు ఆ టీమ్ సహ యజమాని పార్థ్ జిందాల్ ఆ సస్పెన్స్‌ని రివీల్ చేశారు. ‘‘గత ఐపీఎల్ సీజన్‌లో రిషబ్ పంత్ నుంచి ఫ్రాంఛైజీ ఆశించిన మేర ప్రదర్శన రాలేదు. కెప్టెన్‌గా జట్టుని ఆశించిన మేర నడిపించలేకపోయాడు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ నిజాయితీగా అతనికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చింది. కానీ.. ఆ ఫీడ్‌బ్యాక్‌ను పంత్ చాలా ఎమోషనల్‌గా తీసుకుని జట్టుని వీడాలని నిర్ణయం తీసుకున్నాడు’’ అని పార్థ్ జిందాల్ వెల్లడించారు.
‘‘రిషబ్ పంత్‌ను వేలానికి వదిలేయకుండా.. రిటెన్ చేసుకోవడం గురించి అతనితో చాలా సార్లు చర్చలు జరిపాం. కానీ.. అప్పటికే రిషబ్ పంత్ ఢిల్లీ ప్రాంఛైజీని వీడాలని నిర్ణయం తీసుకున్నాడు. అయినప్పటికీ పలు సార్లు ఢిల్లీ ఫ్రాంచైజీ కో-ఓనర్‌లలో ఒకరైన కిరణ్ కుమార్ గ్రంధి చాలా ప్రయత్నించారు. కానీ.. అప్పటికే ఆలస్యమైపోయింది’’ అని పార్థ్ జిందాల్ గుర్తు చేసుకున్నారు.
ఆర్టీఎం కార్డు వాడినా.. లక్నో పట్టు
ఐపీఎల్ 2025 వేలంలో రిషబ్ పంత్ కోసం బిడ్ వేయకూడదని తొలుత నిర్ణయించుకున్నామని.. కానీ టీమ్‌తో అతనికి ఉన్న బంధాన్ని గుర్తుచేసుకుని ఆఖర్లో వేలంలో రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డుని వాడినట్లు పార్థ్ జిందాల్ వెల్లడించారు. కానీ.. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం పంత్ ధరను భారీగా పెంచేసింది. దాంతో ఆర్టీఎం కార్డుని ఢిల్లీ క్యాపిటల్స్ విత్‌డ్రా చేసుకోక తప్పలేదు.
ఐపీఎల్ 2025 వేలానికి రూ.2 కోట్ల కనీస ధరతో వచ్చిన రిషబ్ పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టిగా పోటీపడుతూ రూ.20.75 కోట్ల వరకూ అతడి ధరని పెంచాయి. ఈ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎం కార్డు వాడింది. కానీ.. లక్నో ఒక్కసారిగా పంత్ ధరని రూ.27 కోట్లకి పెంచింది. దాంతో అంత డబ్బుని వెచ్చించడానికి ఢిల్లీ క్యాపిటల్స్ సాహసించలేదు.
ఐపీఎల్ వేలంలో పంత్ ఆల్ రికార్డ్స్ బ్రేక్
ఐపీఎల్ 2024 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ రూ.24.75 కోట్లకి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ని కొనుగోలు చేయగా.. మొన్నటి వరకూ ఇదే రికార్డ్. కానీ.. రిషబ్ పంత్ రూ.27 కోట్ల ధరతో.. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకి అమ్ముడుపోయిన ప్లేయర్‌గా నిలిచాడు. ఈ మెగా వేలంలో రిషబ్ పంత్‌తో పాటు మొత్తం 19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి రూ.68.90 కోట్లని వేలంలో ఖర్చు చేసింది. మరోవైపు ఢిల్లీ టీమ్ రిషబ్ పంత్ స్థానంలో లక్నో టీమ్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను కొనుగోలు చేసింది.