RCB IPL 2025: లక్కీ ఛాన్స్‌లను వదిలేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్ 2025 వేలంలో 4 సార్లూ ఒకే తప్పిదం-why royal challengers bengaluru did not bid for any high profile indian batters with virat kohli in team ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rcb Ipl 2025: లక్కీ ఛాన్స్‌లను వదిలేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్ 2025 వేలంలో 4 సార్లూ ఒకే తప్పిదం

RCB IPL 2025: లక్కీ ఛాన్స్‌లను వదిలేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్ 2025 వేలంలో 4 సార్లూ ఒకే తప్పిదం

Galeti Rajendra HT Telugu
Nov 27, 2024 12:20 PM IST

Royal Challengers Bengaluru IPL 2025: రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్.. ఈ నలుగురిలో ఇద్దరినీ కొనుగోలు చేసేంత డబ్బు, ఆప్షన్ ఐపీఎల్ 2025 వేలం సమయంలో ఆర్సీబీకి ఉంది. కానీ..?

ఐపీఎల్ 2025 వేలంలో ఆర్సీబీ తప్పిదాలు
ఐపీఎల్ 2025 వేలంలో ఆర్సీబీ తప్పిదాలు

ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అనుసరించిన వ్యూహాన్ని టీమ్ఇండియా మాజీ టెస్టు ఓపెనర్, ప్రస్తుత క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఎండగట్టాడు. వేలంలో ఆర్సీబీకి భారత బ్యాటర్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను కొనుగోలు చేసే అవకాశం లభించినా.. అనాలోచితంగా వారిని చేజార్చుకుంది. వీరిలో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ తక్కువ ధరకే లభించే అవకాశం ఉన్నా ఆర్సీబీ వదిలేసుకోవడంపై ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

బలహీనత ఐపీఎల్ 2025లోనూ కంటిన్యూ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో సుదీర్ఘకాలంగా విరాట్ కోహ్లీ తప్ప.. ఇండియన్ టాప్ బ్యాటర్లు ఎవరూ లేరు. ఆ ప్రభావం టీమ్ బ్యాటింగ్ లైనప్‌పై ప్రతి సీజన్‌లోనూ పడుతూ ఉంది. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేని.. దేశవాళీ ఆటగాళ్లు ఛేదనలో ఒత్తిడిని అధిగమించి టీమ్‌ను గెలిపించలేకపోతున్నారు. అయినప్పటికీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ తప్పిదాల్ని దిద్దుకోలేదు.

ఐపీఎల్ 2025 వేలంలో ఆర్సీబీ అనుసరించిన వ్యూహంపై ఆకాశ్ చోప్రా స్పందిస్తూ ‘‘ఆర్సీబీలో విరాట్ తప్ప హై-ప్రొఫైల్ భారత బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరు. అయినప్పటికీ వేలంలో ఒక్క భారత బ్యాటర్‌ని కొనుగోలు చేయలేదు. గత వేలంలో పెద్దగా ఆప్షన్స్ కనిపించలేదు. కానీ.. ఈసారి రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌ రూపంలో నాలుగు ఆప్షన్‌ ఉన్నాయి. పర్స్‌లో చాలినంత డబ్బు కూడా కనిపించింది. అయినప్పటికీ.. ఆ నలుగురూ చేజారుతున్నా చూస్తుండిపోయారు’’ అని మండిపడ్డాడు.

నలుగురులో ఎవరెవరి ధర ఎంతంటే?

రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ వేలానికి వదిలేయగా.. అతడ్ని రూ.27 కోట్లకి లక్నో సూపర్ జెయింట్స్ ఎగరేసుకుపోయింది. అలానే శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ వేలానికి వదిలేయగా.. రూ.26.70 కోట్లకి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను వేలానికి వదిలేయగా.. అతడ్ని రూ.11.25 కోట్లకి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఇక కేఎల్ రాహుల్‌ని లక్నో సూపర్ జెయింట్స్ వేలానికి వదిలేయగా.. అతడ్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.14 కోట్లకి చేజిక్కించుకుంది. ఈ నలుగురూ వేలానికి వచ్చిన సమయంలో ఆర్సీబీ చాలా ఉదాసీనంగానే వ్యవహరించింది. ఆ తర్వాత అందరూ చేజారాక.. దేశవాళీ, ఫామ్‌లో లేని విదేశీ ఆటగాళ్ల కోసం వెంపర్లాడింది.

డబ్బు, ఆప్షన్ ఉన్నా ఉదాసీనత

వాస్తవానికి రూ.83 కోట్ల పర్స్‌తో ఐపీఎల్ 2025 వేలానికి వెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్.. సరైన ప్రణాళికతో దృష్టి పెట్టి ఉంటే.. కనీసం ఇద్దరిని చేజిక్కించునే అవకాశాలూ పుష్కలంగా కనిపించాయి. కానీ.. తేలిగ్గా తీసుకుంది.

వేలంలో వికెట్ కీపర్ జితేశ్ శర్మ కోసం రూ.11 కోట్లు, ఇంగ్లాండ్‌కి చెందిన ఫిలిప్ సాల్ట్ కోసం రూ.11.50 కోట్లు ఖర్చు చేసింది. విడ్డూరం ఏంటంటే. ఈ ఇద్దరూ వికెట్ కీపర్లే. సాధారణంగా ఒక మెయిన్ వికెట్ కీపర్ కోసం భారీగా ఖర్చు చేసి.. స్టాండ్ బై కోసం దేశవాళీ కీపర్‌ను టీమ్‌లోకి ఫ్రాంఛైజీలు తీసుకుంటాయి. కానీ.. ఆర్సీబీ మాత్రం ఇద్దరు వికెట్ కీపర్లకీ భారీగా ఖర్చు చేసింది.

జితేశ్ బదులు ఇషాన్ వచ్చేవాడు కదా?

జితేశ్ శర్మ ఇప్పటి వరకూ 40 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా.. చేసిన పరుగులు 730 మాత్రమే. ఇందులో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. మరి ఇలాంటి ప్లేయర్ కోసం రూ.11 కోట్లు ఖర్చు చేయడమంటే.. అది ఆర్సీబీకే చెల్లింది. అదే సమయంలో ఇషాన్ కిషన్‌ను రూ.11.25 కోట్లకే సన్‌రైజర్స్ హైదరాబాద్ చేజిక్కించుకోవడం గమనార్హం.

Whats_app_banner