Margashira Amavasya: మార్గశిర అమావాస్య ఎప్పుడు? సరైన తేదీ, సమయం, ప్రాముఖ్యత వంటి వివరాలు తెలుసుకొండి-when is margashira amavasya know the details like correct date time importance ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Margashira Amavasya: మార్గశిర అమావాస్య ఎప్పుడు? సరైన తేదీ, సమయం, ప్రాముఖ్యత వంటి వివరాలు తెలుసుకొండి

Margashira Amavasya: మార్గశిర అమావాస్య ఎప్పుడు? సరైన తేదీ, సమయం, ప్రాముఖ్యత వంటి వివరాలు తెలుసుకొండి

Ramya Sri Marka HT Telugu
Nov 27, 2024 02:40 PM IST

Margashira Amavasya: ఆధ్యాత్మిక వృద్ధికీ, పూర్వీకుల ఆరాధనకు మార్గశిర అమావాస్య ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఈ ఏడాది మార్గశిర అమావాస్య తిథి ఎప్పుడు వస్తుంది. సరైన తేదీ, సమయం, ప్రాముఖ్యతతో పాటు పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకోండి.

మార్గశిర అమావాస్య తిథి ఎప్పుడు?
మార్గశిర అమావాస్య తిథి ఎప్పుడు?

మార్గశిర అమావాస్య హిందూ పురాణాల్లో ప్రాముఖ్యత ఎక్కువ. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్షంలోని 15వ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. మార్గశిర అమావాస్యనే మార్గశీర్ష అమావాస్య, ఆగహన అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజు పూర్వీకులను ఆరాధిస్తే వారి ఆత్మలకు శాంతి కలిగుతుందని హిందువులు నమ్ముతారు. పితృపూజకు మార్గశిర అమావాస్య అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున చాలా మంది గంగా నదిలో పవిత్ర స్నానాలు చేస్తారు. దానధర్మాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మార్గశిర అమావాస్య రోజు శ్రీమహావిష్ణువును, శివుడిని ఆరాధించడం వల్ల వారీ ఆశీర్వాదం, రక్షణ లభిస్తాయని నమ్మిక. పూర్వీకులను ఆరాధించడం వల్ల కుటుంబాలకు శ్రేయస్సు కలగడంతో పాటు ఆధ్మాత్మిక వృద్ధి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

మార్గశిర అమావాస్య తిథి ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర అమావాస్య అమావాస్య తిథి 30 నవంబర్ 2024న ఉదయం 10:29 గంటలకు ప్రారంభమవుతుంది. తిరిగి 1 డిసెంబర్ 2024 ఉదయం 11:50 గంటలకు ముగుస్తుంది. అంటే 1 డిసెంబర్ 2024న మార్గశిర అమావాస్య పండుగను జరుపుకోవాలి.

మార్గశిర అమావాస్య ప్రాముఖ్యత ఏంటి?

హిందూ పురాణాలు మార్గశిర అమావాస్య గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రోజున భక్తులు తమ జీవితంలోని ప్రతికూల శక్తుల నుంచి బయటపడేందుకు రకరకాల పూజలు చేస్తారు. పూర్వీకుల ఆత్మల శాంతి కోసం తిలా తర్పణం, పిండ దానం, పితృ పూజ వంటి ప్రధాన ఆచారాలను నిర్వహిస్తారు. ఈ రోజు పేదవారికి అవసరమైన వస్తువులను దానం చేయడం పుణ్యకార్యంగా భావిస్తారు. అలాగే మార్గశిర అమావాస్య రోజున శివుడికి రుద్రాభిషేకం, మహామృత్యుంజయ హోమం వంటి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల జీవితంలో సానుకూలత, శ్రేయస్సు, కీర్తి, ఆనందం, ఆరోగ్యం కలుగుతాయని హిందువులు నమ్ముతారు.

మార్గశిర అమావాస్య రోజు చేయవలసిన పనులేంటి?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మార్గశిర అమావాస్య పండుగకు శని భగవానుడికి విడదీయలేని బంధం ఉంది. ఈ రోజు శని పూజ చేయడం వల్ల శనిగ్రహం వల్ల వ్యక్తిపై పడే ప్రతికూల ప్రభావాలు, బాధలు తగ్గుతాయి. ఈ రోజు శనిపూజ చేయడం వల్ల అదృష్టం వరిస్తుందని నమ్మిక.

మార్గశిర అమావాస్య రోజు ఆది దేవుడైన సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించడం వల్ల దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ రోజు గంగా నదిలో స్నానం చేయడం వల్ల మనస్సు, ఆత్మ శుద్ధి అయి సానుకూల శక్తులకు నిలయంగా మారతాయి.మార్గశిర అమావాస్య రోజు ఉపవాస దీక్ష చేపట్టే భక్తులు తప్పనిసరిగా ప్రవహించే నీటిలో నువ్వులను వదలాలి. ఇలా చేయడం వల్ల సకల పాపాలు, దోషాలు తొలగిపోయి శాంతి, శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి, ఆరోగ్యం వంటి అన్ని విషయాల్లో శుభ ఫలితాలు దక్కుతాయి.

మార్గశిర అమావాస్య రోజు చేయవలసిన పరిహారాలు:

  • మార్గశిర అమావాస్య రోజు భక్తులు శ్రీమహావిష్ణువు, శివుడిని పూజించాలి.
  • పూర్వీకుల ఆత్మ శాంతి కోసం పవిత్ర నదుల్లో స్నానం చేయాలి, పితృపూజ నిర్వహించాలి.
  • ఉపవాస దీక్ష చేపట్టి ఆహారం, పానీయాలకు దూరంగా ఉండాలి.
  • పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి.
  • ఆధ్మాత్మిక వృద్ధి కోసం ఆలయాలకు నెయ్య వంటివి దానం చేయాలి.

(గమనిక: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా సత్యం, ఖచ్చితమైనదని మేము చెప్పడంలేదు. వేరు వేరు వెబ్ సైట్లు, నిపుణుల సలహాల మేరకు వీటిని పొందుపరుస్తున్నాం. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు దీనికి బాధ్యత వహించదు. వీటిని పాటించేముందు సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.)

Whats_app_banner