Visakha Airport Lizards Seize : విశాఖ ఎయిర్ పోర్టులో ఆరు అరుదైన నీలం నాలుక బల్లులు సీజ్, ఇద్దరు అరెస్ట్
Visakha Airport Lizards Seize : విశాఖ ఎయిర్ పోర్టులో అరుదైన బ్లూ టంగ్ లిజర్డ్స్ ను పట్టుకున్నారు. థాయిలాండ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద ఆరు లైవ్ లిజర్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరినీ అరెస్టు చేసి, విచారణ చేస్తున్నారు.
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో అక్రమంగా రవాణా చేస్తున్న అంతరించిపోతున్న నీలిరంగు నాలుక బల్లులను పట్టుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్, డీఆర్‌ఐ అధికారులు మూడు నీలిరంగు నాలుక బల్లులు, మూడు వెస్ట్రన్ బల్లులను స్వాధీనం చేసుకున్నారు. థాయిలాండ్ నుంచి ఇండియాకు అక్రమంగా బల్లులను తీసుకొచ్చినట్టు అధికారులు గుర్తించారు. డీఆర్‌ఐ, కస్టమ్స్, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు ప్రయాణికుల వద్ద బల్లులను గుర్తించారు. ఈ బల్లులు చాలా ప్రమాదకరమైనవని అటవీ అధికారులు తెలిపారు.
ఈ నెల 23వ తేదీ రాత్రి విశాఖపట్నం విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు ప్రయాణికులను పట్టుకున్నారు. థాయిలాండ్‌లోని బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆరు లైవ్ ఈస్టర్న్ బ్లూ-టాంగ్డ్ బల్లులను (టిలిక్వా స్కిన్‌కోయిడ్స్) కేక్ ప్యాకెట్లలో పెట్టి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వీటిని వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసి పరిశీలించగా... ఇవి అంతరించిపోతున్న లిజర్డ్ అని గుర్తించింది. అవసరమైన లైసెన్సులు, అనుమతులు లేకుండా ఇటువంటి జంతు జాతులను భారతదేశానికి దిగుమతి చేయడం నిషేధం అని అధికారులు తెలిపారు.
అవసరమైన పత్రాలు లేకుండా బల్లులను భారత్ కు దిగుమతి చేస్తే కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 2(33) ప్రకారం చట్టవిరుద్ధమని అధికారులు తెలిపారు. మొత్తం ఆరు బల్లులను స్వాధీనం చేసుకుని తిరిగి థాయ్‌లాండ్‌కు పంపించినట్లు చెప్పారు. కస్టమ్స్ చట్టం, 1962, వన్యప్రాణి సంరక్షణ చట్టం1972 ప్రకారం ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసి, తదుపరి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈస్టర్న్ బ్లూ-టాంగ్డ్ బల్లులు
ఈస్టర్న్ బ్లూ-టాంగ్డ్ లిజర్డ్ ఆస్ట్రేలియాలో కనిపిస్తుంటాయి. ఈ సరీసృపాలకు ప్రకాశవంతమైన నీలిరంగు నాలుక ఉంటుంది. ఇవి ఆహారంలో కీటకాలు, నత్తలు, క్యారియన్, అడవి పువ్వులు, స్థానిక పండ్లు, బెర్రీలు ఉంటాయి. నీలి నాలుకగల బల్లులు వివిపరస్, అంటే పిల్లలు పుట్టిన కొద్దికాలానికే స్వయం సమృద్ధిగా జీవిస్తుంటాయి. వీటి కాటు నొప్పి, చిన్న గాయాలు కలిగించవచ్చు. అవి అంతగా విషపూరితం కాదని తెలుస్తోంది.
భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి పేరు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడుతూ ఇటీవల శాసనసభలో ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. గిరిజనుల పక్షాన పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్లకు గడగడలాడించారన్నారు. చింతగొంది, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి బ్రిటీషర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించారని గుర్తుచేశారు. మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి 125 జయంతిని ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారని గుర్తు చేశారు. దేశం కోసం పోరాడిన వీరుడిని భావితరాలకు తెలిసేలా చేయడం మన బాధ్యత అన్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు భోగాపురం ఎయిర్ పోర్టును ఆలస్యం చేశారన్నారు. అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం విమానశ్రయానికి పెట్టాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. అల్లూరి స్మారక మ్యూజియంను కూడా నిర్మించాలని నిర్ణయించామన్నారు. అల్లూరి విగ్రహం పార్లమెంట్ లో కూడా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
సంబంధిత కథనం