HYD to Vizag : శంషాబాద్ టు విశాఖపట్నం.. 4 గంటల్లోపే ప్రయాణం.. గంటకు 220 కి.మీ స్పీడ్‌తో ట్రైన్!-shamshabad to visakhapatnam can be reached within 4 hours through the semi high speed corridor ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Hyd To Vizag : శంషాబాద్ టు విశాఖపట్నం.. 4 గంటల్లోపే ప్రయాణం.. గంటకు 220 కి.మీ స్పీడ్‌తో ట్రైన్!

HYD to Vizag : శంషాబాద్ టు విశాఖపట్నం.. 4 గంటల్లోపే ప్రయాణం.. గంటకు 220 కి.మీ స్పీడ్‌తో ట్రైన్!

HYD to Vizag : హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అటు నుంచి కూడా భారీగా హైదరాబాద్‌కు వస్తుంటారు. కానీ ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటోంది. అందుకే ఈ రూట్‌లో వందేభారత్‌ను తీసుకొచ్చారు. మరింత సమయం తగ్గించడానికి తాజాగా అడుగులు పడుతున్నాయి.

శంషాబాద్ టు విశాఖపట్నం

ఈ పోటీ ప్రపంచంలో ప్రయాణ సమయం ఎంతో కీలకం. అందుకే వీలైనంత తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరేలా ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్ కారిడార్‌కు వేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా.. శంషాబాద్‌- విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ ఖరారైంది.

సూర్యాపేట, విజయవాడ మీదుగా సెమీ హైస్పీడ్ కారిడార్‌ను ప్రతిపాదించారు. విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేట మీదుగా కర్నూలుకు మరో కారిడార్‌ నిర్మించనున్నారు. ఇది విశాఖ నుంచి మొదలై.. సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ మీదుగా కర్నూలు చేరుతుంది. ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్‌ సర్వే ఫైనల్ దశకు చేరింది. ఈ సర్వే నివేదికను వచ్చేనెలలో సమర్పించనున్నట్టు తెలుస్తోంది.

ఏపీ, తెలంగాణలో మొదటి సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ ఇదే కావడం విశేషం. ఈ మార్గంలో శంషాబాద్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలను అనుసంధానించేలా ప్రణాళిక రూపొందించనున్నారు. విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్‌ రైళ్లలో స్వస్థలాలకు వేగంగా చేరుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. గంటకు 220 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించేలా డిజైన్‌ చేస్తున్నారు.

ఈ సెమీ హైస్పీడ్ కారిడార్ పూర్తయితే.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి కేవలం నాలుగు గంటల్లోపే చేరుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్- విశాఖ మధ్య రైలు ప్రయాణానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ మాత్రం 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటోంది. సికింద్రాబాద్‌ -విశాఖ మధ్య ప్రస్తుతం రెండు మార్గాల్లో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గంలో ఒకటి.. నల్గొండ, గుంటూరు, విజయవాడ ఈ మార్గం రెండోది.

ప్రస్తుతం ఈ రెండు మార్గాల్లో రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110 నుంచి 130 కిలోమీటర్ల వరకు ఉంది. వీటితో పోలిస్తే కొత్తగా రానున్న శంషాబాద్‌ -విశాఖపట్నం మార్గం దగ్గరవుతుంది. వేగం కూడా దాదాపు రెట్టింపు అవుతుంది. ప్రయాణ సమయం 4 గంటల్లోపే ఉండనుంది. ఇటు చాలా పట్టణాలకు రైల్వే లైన్ అనుసంధానం కానుంది.