Red Sandal Auction: ఎర్ర చందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్ విండో విధానం కోరిన డిప్యూటీ సీఎం పవన్
Red Sandal Auction: ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని ఏపీ డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సింగిల్ విండోకు కస్టోడియన్ గా ఉంటుందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరారు.
Red Sandal Auction: ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ – వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్‌కు తెలియచేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం భూపేంద్ర యాదవ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో చర్చించారు.
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపాదించిన ప్రకారం ఎర్రచందనం అమ్మకం, ఎగుమతి చేసే విషయంలో సింగిల్ విండో విధానం ఉంటే మేలు జరుగుతుందని, ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కస్టోడియన్ గా వ్యవహరిస్తుందని ఈ ప్రతిపాదననను కేంద్రం పరిశీలించాలని పవన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతి సాగిస్తుంది. తద్వారా ఈ-వేలం ద్వారా రెవెన్యూ పెరుగుతుందన్నారు.
• ఏ రాష్ట్రంలో పట్టుబడినా...
ఎర్రచందనం అరుదైన వృక్ష సంపద అని ఆంధ్ర ప్రదేశ్ అటవీ ప్రాంతంలోనే పెరుగుతుంది. ఈ క్రమంలో కేంద్రం నిబంధనలను సవరించి ఆంధ్రప్రదేశ్ వెలుపల పట్టుబడిన ఎర్రచందనం సైతం సింగిల్ విండో వేలంలో భాగంగా కస్టోడియన్‌గా ఉండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పట్టుబడిన ఎర్రచందనం అమ్ముకోవడానికి కుదరదని అమ్మకాలు, ఎగుమతులు ఒకే విధానం ద్వారా కొనసాగుతాయని చెప్పారు. కేంద్ర పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కస్టోడియన్ గా కొనసాగుతుందని పవన్ కల్యాణ్ వివరించారు.