Thotakura Garelu: తోటకూర గట్టి గారెలు, స్నాక్స్‌గా ఇలా చేసేయండి పిల్లలకి కచ్చితంగా నచ్చుతాయి-thotakura garelu recipe in telugu know how to make this snacks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thotakura Garelu: తోటకూర గట్టి గారెలు, స్నాక్స్‌గా ఇలా చేసేయండి పిల్లలకి కచ్చితంగా నచ్చుతాయి

Thotakura Garelu: తోటకూర గట్టి గారెలు, స్నాక్స్‌గా ఇలా చేసేయండి పిల్లలకి కచ్చితంగా నచ్చుతాయి

Haritha Chappa HT Telugu
Nov 27, 2024 03:30 PM IST

Thotakura Garelu: తోటకూరతో వండడం చాలామంది తగ్గించేశారు. తోటకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక్కడ మేము తోటకూర గట్టి గారెలు రెసిపీ ఇచ్చాము.

తోటకూర గారెలు రెసిపీ
తోటకూర గారెలు రెసిపీ

తోటకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తోటకూరతో చేసే రెసిపీలు అనగానే తోటకూర పప్పు, తోటకూర వేపుడు మాత్రమే అనుకుంటారు. వీటితో గారెలు కూడా చేసుకోవచ్చు. వీటిని తోటకూర గట్టి గారెలు అంటారు. అంటే ఇవి కాస్త మెత్తగా కాకుండా గట్టిగా వస్తాయి. రుచిగా కూడా ఉంటాయి. దక్షిణాది లోని చాలా ప్రాంతాల్లో ఈ తోటకూర గట్టి గారెలు ఎక్కువమందికి పరిచయమే. వీటిని తింటే ఆరోగ్యానికి కూడా మంచిదే. ఈ తోటకూర గట్టి గారెలు రెసిపీ తెలుసుకోండి.

తోటకూర గట్టి గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు

శెనగపప్పు - ఒక కప్పు

మినప్పప్పు - అర కప్పు

తోటకూర - రెండు కట్టలు

అల్లం - చిన్న ముక్క

ఉప్పు - రుచికి సరిపడా

వెల్లుల్లి రెబ్బలు - నాలుగు

పచ్చిమిర్చి - రెండు

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

తోటకూర గట్టి గారెలు రెసిపీ

1. శెనగపప్పు మినప్పప్పును నాలుగు గంటల ముందే నానబెట్టుకోవాలి.

2. అవి బాగా నానాక మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఎక్కువ నీళ్లు పోస్తే గారెలు రావు.

3. కాబట్టి నీళ్లు చాలా తక్కువ పోసి గట్టిగా రుబ్బుకోవాలి.

4. ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.

5. తోటకూరను సన్నగా తరిగి మట్టి లేకుండా కడిగి ఆ తరుగును కూడా పప్పు ముద్దలో వేసి కలుపుకోవాలి.

6. అలాగే సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి తరుగు, రుచికి సరిపడా ఉప్పు, మూడు స్పూన్ల నూనె వేసి బాగా కలుపుకోవాలి.

7. సోంపును కూడా వేసి కలిపితే మంచి రుచి వస్తుంది.

8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.

9. ఈ పప్పు ముద్దలోంచి చిన్న ముద్దను తీసి గారెలు లాగా చేతితోనే ఒత్తుకుని మధ్యలో చిల్లు పెట్టి వేడెక్కిన నూనెలో వేసి రెండు వైపులా రంగు మారేవరకు వేయించుకోవాలి.

10. అంతే టేస్టీ తోటకూర గట్టి గారెలు రెసిపీ రెడీ అయిపోతుంది.

11. దీన్ని స్పైసీగా చేసుకుంటే రుచి అదిరిపోతుంది.

12. పిల్తల కోసం అయితే పచ్చిమిర్చి తగ్గించి వేయాలి.

13. అదే పెద్దవాళ్లకైతే పచ్చిమిర్చిని బాగా ఎక్కువ వేసుకొని చేస్తే రుచిగా ఉంటుంది.

తోటకూర ఫ్రై లేదా తోటకూర పప్పు ఇష్టం లేనివారు ఇలా తోటకూర గారెలు చేసుకుని తినండి. అయితే దీన్ని ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తాము. కాబట్టి తరచూ తినడం మాత్రం మంచిది కాదు. అప్పుడప్పుడు స్నాక్స్ లాగా ఇలా తోటకూర గట్టి గారెలు చేసుకుంటే రుచిగా ఉంటాయి.

Whats_app_banner