Marriage Age: 20, 30,40.. వివాహం చేసుకోవడానికి అనువైన వయసు ఏది? ఏ వయసులో చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది?
Marriage Age: వివాహం అనేది శారీరకంగా, మానసికంగా రెండు జీవితాలను కలిపే బంధం.అయితే పెళ్లి చేసుకోవాలంటే మనసు, ఆర్థిక పరిస్థితి, అనుకూలత అన్నీ ముఖ్యమే. ఏ వయసులో పెళ్లి చేసుకుంటే మంచిది? అనే సందేహం ఎక్కువ మందిలో ఉంది. 20లు, 30లు, 40లు… ఇలా ఏ వయసులో చేసుకుంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయో తెలుసుకోండి.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన దశ.పెళ్లి గురించి ప్రతి ఒక్కరూ కలలు కంటారు. చేసుకోబోయే వారు ఇలా ఉండాలి, అలా ఉండాలని ఊహించుకుంటారు. వైవాహిక జీవితం బాగుండాలని, మంచి జీవిత భాగస్వామి రావాలని దేవుళ్లను మొక్కుకుంటారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుతున్నది కలలు కనడం గురించి కాదు, ఏ వయసులో పెళ్లి చేసుకుంటే మంచిది? అని. దీనికి సైకాలజిస్టులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
సైకాలజిస్టులు ఏం చెబుతున్నారు?
కొందరు 21 ఏళ్లకే పెళ్లి చేసుకుంటారు.మరికొందరు 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడతారు. మరికొందరు 35 ఏళ్లు దాటి 40కి పరుగులు తీస్తున్నా కూడా పెళ్లిని వాయిదా వేస్తూ ఉంటారు. మరి పెళ్లికి అనువైన వయసు ఏది? వివాహం ఏ వయసులో చేసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి? ఈ విషయాలను సైకాలజిస్టులు మనతో పంచుకున్నారు. వైవాహిక జీవితం చివరి వరకు కొనసాగాలంటే సైకాలజిస్ట్, సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ వ్యవస్థాపకుడు నుపుర్ ధాకే ఫాల్కర్ హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడారు.
వివాహానికి ముందు
వివాహానికి సిద్ధంగా ఉన్న జంటలు ముందుగా మంచి కమ్యూనికేషన్ ను పెంపొందించుకోవాలి. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవాలి. జీవితంలో వారికి ఏ లక్ష్యాలు ఉన్నాయో చెప్పి, వారి భాగస్వామిని కూడా అడిగి తెలుసుకోవాలి. వివాహం గురించి వారి భావాలు ఏమిటో వారు తెలుసుకోవాలి. ముందుగా, మీరు అతని/ఆమెతో సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. వారి మద్దతు మీకు ఉంటుందని నిర్ధారించుకోవాలి. ఇద్దరి వ్యక్తిగత అభిప్రాయాలు, కుటుంబం, జీవనశైలి, ఆర్థిక పరిస్థితి గురించి స్వేచ్ఛగా చర్చించి, ఆపై నిర్ణయం తీసుకోవాలి.
20 నుంచి 30 ఏళ్ల మధ్య పెళ్లి చేసుకుంటే…
తల్లిదండ్రులు తమ పిల్లలతో వివాహం గురించి స్వేచ్ఛగా చర్చించాలి. వారు వివాహానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే వారికి పెళ్లి చేయాలి. 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వివాహం చేసుకున్న వారికి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. అలాంటి వివాహాల్లో విడాకుల అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నూపుర్ చెప్పారు. నేషనల్ సర్వే ఆఫ్ ఫ్యామిలీ గ్రోత్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, 32 సంవత్సరాల కంటే ముందే వివాహాలు చేసుకున్న జంటల్లో విడాకులు తీసుకునే అవకాశం 11 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కానీ చిన్న వయస్సులో వివాహం చేసుకున్న వారి మనస్తత్వంలో మాత్రం మార్పు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
30 నుంచి 40 ఏళ్ల మధ్య పెళ్లి చేసుకుంటే
మీరు 30-40 ఏళ్ళ మధ్యలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఆ వయసుకే మీరు మీ కుటుంబం, బంధువులు, స్నేహితుల నుండి వివాహం విషయంలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ వయస్సులో వివాహం చేసుకోవడం వల్ల మీకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. దాదాపు ప్రతి ఒక్కరూ ఈ వయస్సులో ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటారు. వివాహం, జీవితం గురించి వారికి ఎక్కువ అవగాహన ఉంటుంది. వారు తమ భాగస్వామి నుండి ఏమి కోరుకుంటున్నారనే దానిపై వారికి స్పష్టత ఉంటుంది. ఈ వయస్సులో వివాహం చేసుకున్న వారి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుందని నూపుర్ చెప్పారు. అలా అని మరీ ఆలస్యం చేయకూడదు.
30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తులు వారి వ్యక్తిగత విలువలు, లక్ష్యాలు, భాగస్వాముల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు, ఇది ఎక్కువ అనుకూలత, లోతైన సంబంధానికి దారితీస్తుంది. మానసికంగా, ఆర్థికంగా స్థిరంగా ఉండటం వల్ల వైవాహిక జీవితం ప్రశాంతంగా సాగుతుంది. అయితే, ఈ వయస్సులో వివాహంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు, ముఖ్యంగా పిల్లలను కనే విషయానికి వస్తే వారికి సమస్యలు ఎదురవ్వవచ్చు. పిల్లల్ని 30 ఏళ్ల లోపే కంటే మంచిదని సైన్సు చెబుతోంది. కాబట్టి పిల్లల కోసం ముందే పెళ్లిళ్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
టాపిక్