Chicken Sherwa: చికెన్ షేర్వా చేసే పద్ధతి ఇది, చపాతీ రోటీలతో అదిరిపోయే స్పైసీ రెసిపీ-chicken sherwa recipe in telugu know how to make this healthy recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Sherwa: చికెన్ షేర్వా చేసే పద్ధతి ఇది, చపాతీ రోటీలతో అదిరిపోయే స్పైసీ రెసిపీ

Chicken Sherwa: చికెన్ షేర్వా చేసే పద్ధతి ఇది, చపాతీ రోటీలతో అదిరిపోయే స్పైసీ రెసిపీ

Haritha Chappa HT Telugu
Nov 27, 2024 11:30 AM IST

Chicken Sherwa: చికెన్ షేర్వా పేరు చెబితేనే నోరూరిపోతుంది. చపాతీ, రోటీలను దీంతో తింటే ఎంతో టేస్టీగా అనిపిస్తాయి. చికెన్ షేర్వా ఎలా చేయాలో రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

చికెన్ షేర్వా
చికెన్ షేర్వా

చికెన్ షేర్వా చేయడం కష్టం అనుకుంటారు. కానీ దీన్ని చాలా సులువుగా చేయొచ్చు. కేవలం తెలంగాణ, ఆంధ్రాలోనే కాదు... తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కూడా చికెన్ షేర్వాని ఇష్టంగా తింటారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రా కొన్ని ప్రాంతాల్లో దీన్ని సాల్నా అని పిలుస్తారు. అదే తెలంగాణ విషయానికొస్తే చికెన్ షేర్వా అని అంటారు. ఈ చికెన్ షేర్వా రెసిపీ పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ప్రత్యేకంగా వండుతారు. దీన్ని చపాతీ, రోటీలతో తింటే ఆ రుచి వేరు పైగా కాస్త స్పైసీగా చేసుకుంటే చలికాలంలో ఇంకా ఇష్టంగా తినాలనిపిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇక రెసిపీ విషయం మీకు వస్తే అరగంటలో దీన్ని వండొచ్చు.

చికెన్ షేర్వా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

ఎముకలతో కూడిన చికెన్ - అర కిలో

ఉల్లిపాయలు - రెండు

బిర్యానీ ఆకు - ఒకటి

నీళ్లు - ఒకటిన్నర కప్పు

మిరియాలు - ఒక స్పూను

క్యారెట్ ముక్కలు - అరకప్పు

క్యాప్సికం ముక్కలు - పావు కప్పు

వేరుశనగ పలుకులు - అరకప్పు

పచ్చి కొబ్బరి తురుము - అరకప్పు

నూనె - సరిపడినంత

టమోటాలు - రెండు

అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

దాల్చిన చెక్క - చిన్న ముక్క

యాలకులు - మూడు

అనాసపువ్వు - ఒకటి

లవంగాలు - నాలుగు

ధనియాల పొడి - ఒకటిన్నర స్పూను

కారం - రెండు స్పూన్లు

చికెన్ మసాలా పొడి - ఒక స్పూను

పుదీనా తరుగు - నాలుగు స్పూన్లు

పచ్చిమిర్చి - నాలుగు

పసుపు - అర స్పూను

సోంపు - ఒక స్పూన్

అనాసపువ్వు - ఒకటి

చికెన్ షేర్వా రెసిపీ

1. చికెన్ షేర్వా చేయడానికి ముందుగా చికెన్ స్టాక్ ను తయారు చేయాలి.

2. అంటే ఇది ఒక రకమైన సూప్ లాంటిది.

3. దీనికోసం మీరు స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఎముకలతో కూడిన చికెన్ ముక్కలను ఎంపిక చేసి అందులో వేయండి.

4. అందులోనే నీళ్లు వేసి మిరియాలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయల తరుగు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి మూత పెట్టి అరగంట పాటు మరిగించండి.

5. చికెన్ ముక్కలు ఎముకల్లోంచి సారమంతా నీటిలో కలిసి చికెన్ స్టాక్ రెడీ అయిపోతుంది.

6. ఇప్పుడు ఇందులోంచి ఉడికిన కూరగాయ ముక్కలు మాత్రం తీసి పక్కన పెట్టేసేయండి.

7. చికెన్ ముక్కలు చికెన్ సూప్ మాత్రం ఉంచుకోండి.

8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పల్లీలు, గసగసాలు వేసి వేయించండి.

9. మిక్సీ జార్లో వేయించిన గసగసాలు, పల్లీలు, పచ్చి కొబ్బరి తురుము, సోంపు వేసి తగినంత నీళ్లు వేసి మెత్తని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి.

10. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి అనాసపువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించండి.

11. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలను, కొత్తిమీరను వేసి బాగా వేయించండి.

12. అవి బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోండి.

13. తర్వాత అందులోనే కొత్తిమీర తరుగును వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి బాగా కలపండి.

14. ఇప్పుడు చికెన్ ముక్కలను కూడా వేసి బాగా ఉడికే వరకు వేయించుకోండి.

15. టమాటో తరుగు, పచ్చిమిర్చి, పసుపు, ధనియాల పొడి, కారం కూడా వేసి బాగా కలపండి.

16. దీన్ని చిన్నమంట మీద అరగంట పాటు ఉడికిస్తే ముక్కలు బాగా ఉడుకుతాయి.

17. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ స్టాక్ ను ముక్కలతో సహా దీనిలో వేసేయండి.

18. పావుగంటసేపు మూత పెట్టి ఉడికించండి.

19. ఆ తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న కొబ్బరి పల్లీల పేస్టును, పుదీనా ఆకులను వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడికించండి.

20. ఆ తర్వాత మూత తీసి చికెన్ మసాలాను వేసి ఉడికించండి.

ఒక పావుగంటలో స్టవ్ ఆఫ్ చేయండి.

21. అంతే చికెన్ షేర్వా రెడీ అయినట్టే. దీని వండడానికి కాస్త సమయం పడుతుంది.

22. కానీ రుచి మాత్రం అదిరిపోతుంది. దీన్ని ఇడ్లీ, పూరీ, చపాతీ, పరోటా ఇందులో తిన్నా రుచిగా ఉంటుంది.

23. ఒక్కసారి చేసుకుని చూడండి మీ అందరికీ నచ్చడం ఖాయం .

చికెన్ షేర్వాను తినడం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. దీనిలో మనం ఎముకల నుంచి కాల్షియం సారాన్ని బయటకి తీసి సూపులా చేసి వండాము. కాబట్టి చికెన్ షేర్వా తినడం వల్ల పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. వారానికి ఒక్కసారైనా తినేందుకు ప్రయత్నించండి. చికెన్ షేర్వా పేరు చెప్తేనే నోరూరి పోతుంది. చపాతీ, రోటీలను దీంతో తింటే ఎంతో టేస్టీగా అనిపిస్తాయి. చికెన్ షేర్వా ఎలా చేయాలో రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

Whats_app_banner